ఇకపై తెలుగులోనే జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. !!

By అంజి  Published on  23 Dec 2019 9:49 AM GMT
ఇకపై తెలుగులోనే జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. !!

ఇకపై జెఈఈ ఎగ్జామ్స్ ను తెలుగు సహా పదకొండు ప్రాంతీయ భాషల్లో రాసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు మీడియం విద్యార్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇది 2021 నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో పదో తరగతి వరకూ తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తప్పనిసరిగా జేఈఈ కోసం ఇంగ్లీషు మీడియంలో ఇంటర్మీడియట్ చదివి తంటాలు పడే పరిస్థితి నుంచి విముక్తి లభిస్తుంది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీషులో రాయాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు విద్యార్థులు గుజరాతి, హిందీ , అస్సామియా, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళ, తెలుగు, ఉర్దూలలో కూడా విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి వీలు పడుతుంది. ఇప్పటి వరకూ ఇంగ్లీష్, హిందీ, గుజరాతీలలోనే ఈ పరీక్షలు వ్రాసేందుకు వీలుంది.

తెలంగాణ నుంచి ఏటా లక్షన్నర విద్యార్థులు జేఈఈ పరీక్షలు రాస్తూంటారు. 2018లో 88,000 మంది ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, తెలంగాణ నుంచి 77,000 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాశారు. వీరిలో చాలా మంది ఈ జేఈఈ కోసమే మీడియం మార్చి, ఇంగ్లీషులో చదవాల్సి వచ్చింది. దీని వల్ల పరీక్షలు రాసే వేగం తగ్గుతుంది. మనసులోనే తెలుగులో అర్థం చేసుకుని, ఇంగ్లీషులో తర్జుమా చేసుకుని వ్రాయాల్సి రావడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో చేరలేకపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోతుంది.

కొన్ని సమస్యలు..

అయితే ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పటి వరకూ విద్యార్థులు ఎన్ సీ ఈ ఆర్ టీ పుస్తకాలను ఫాలో అయి ప్రిపేర్ అవుతున్నారు. తెలుగులో రాయాలంటే ఈ భాషలో ఎన్ సీ ఈ ఆర్ టీ పుస్తకాలు లేవు. ముఖ్యంగా పారిభాషిక పదకోశం అంటే టెక్నికల్ వర్డ్స్ అంతగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు వీటిని తెలుగులోకి అనువాదం చేయాలి. అనువాదంలో ఒకే పదానికి వేర్వేరు అర్థాలున్న పరిస్థితుల్లో పలు సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు ప్రైవేటు సంస్థలే వెలువరిస్తున్నాయి. ఒక టెక్నికల్ వర్డ్ కి వేర్వేరు పదాలు అనువాదకులు వాడితే చాలా ఇబ్బందికరమైన స్థితి ఉంటుంది. పరీక్షలు దిద్దే వారికి చాలా కష్టం అవుతుంది. తెలుగులో స్టడీ మెటీరియల్ కూడా అంతగా అందుబాటులో లేదు. తెలుగు అకాడమీ కొన్ని ప్రచురించనా, అవి సరిపోవని ఫ్యాకల్టీలు చెబుతున్నారు.

అందునా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన తరువాత రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులు ఇంగ్లీషులోనే వ్రాసే పరిస్థితి ఉంటుంది. తరువాత ఇంజనీరింగ్ కోర్సులు ఇంగ్లీషు లోనే ఉంటాయి. కాబట్టి తెలుగులో పరీక్ష రాసినా తరువాత ఇంగ్లీషే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను ఇంజనీరింగ్ స్థాయిలో ఎదుర్కొనే కన్నా ఇంటర్మీడియట్ లోనే ఎదుర్కుంటే బాగుంటుందన్నది కొందరి అభిప్రాయం. అయితే తెలుగు భాషలో జేఈఈ పరీక్ష వ్రాస్తే గ్రామీణ విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో చేరడానికి వీలుంటుందని మరి కొందరు వాదిస్తున్నారు.

Next Story