నియంత నేతలకు అడ్డుకట్ట వేయాలంటే మండలి ఉండాల్సిందే : యనమల రామకృష్ణుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 6:38 AM GMT
నియంత నేతలకు అడ్డుకట్ట వేయాలంటే మండలి ఉండాల్సిందే : యనమల రామకృష్ణుడు

నియంతల నియంత్రణకు శాసన మండలి రాష్ట్రాలలో శాశ్వత సభగా ఉండాలని తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల పరిక్షణకు ఎగువ సభలు కీలకమన్నారు. ప్రజాస్వామ్య నియంతలా మారిన జగన్‌ లాంటి నేతల కట్టడికి మండలి ఉండాల్సిందేనన్నారు.

ప్రజాస్వామ్యం శిథిలావస్థకు చేరుతున్న తరుణంలో రాష్ట్రాలలో ఎగువ సభ తప్పనిసరి. దిగువ సభలో అధికార పార్టీ ప్రజాభీష్టానికి విరుద్దంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా తీసుకున్న నిర్ణయాలను ఎగువ సభ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని తిరిగి మళ్లీ దిగువ సభకు పున: పరిశీలనకు పంపుతుంది. ఎగువ సభకు వీటో పవర్ ఉండదుగాని, ప్రజలను, దిగువ సభను చైతన్యపరిచేందుకు ఎగువ సభ దోహదం చేస్తుంది. నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, విస్తృత ప్రజాభిప్రాయానికి ఎగువసభ పెద్దపీట వేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే ఈ 2బిల్లుల(మూడు రాజధానుల బిల్లు, సిఆర్ డిఏ రద్దు బిల్లు)ను శాసన మండలి సెలెక్ట్ కమిటికి ఎగువ సభ పంపింది కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్దంగా లేకపోవడం గమనార్హం. అదే ఎగువ సభ అనేదే లేకపోతే, ప్రజా ప్రయోజనాలకు ఉండాల్సిన ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో కొరవడుతుంది.

కేంద్రంలో రాజ్యసభ ఎలాగో రాష్ట్రంలో శాసన మండలి అదేవిధంగా పనిచేస్తుంది. శాసన నిర్మాణంలో, ప్రజాస్వామ్యంలోనూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. బొటాబొటి మెజారిటి ఉన్న ప్రభుత్వంగాని, లేదా మైనారిటి ప్రభుత్వంగాని దేశంలో, రాష్ట్రాలలో ప్రజా ప్రయోజనాలను కాలరాసే ధైర్యం చేయలేవు. రాజ్యసభ తరహాలోనే రాష్ట్రాలలో శాసన మండళ్లు కూడా శాశ్వతంగా కొనసాగాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి అవసరమైన సవరణలు తీసుకురావాలి.

రాజ్యసభ శాశ్వత సభగా ఉన్నప్పుడు శాసనమండలి ఎందుకు ఉండకూడదు..? నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్య నియంతలుగా మారితే, ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎగువసభ తప్పకుండా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అలాంటి ఎగువసభను అడ్డుగోడగా పేర్కొనడం సరైందికాదు..రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పరిరక్షించే రాజ్యాంగ సంస్థ శాసన మండలి. దిగువ సభలో అత్యధికులు కొన్నిమార్లు ప్రజాభిప్రాయాన్ని తోసిరాజన్నప్పుడు (ఉదాహరణకు ఇంగ్లీషు మీడియం బిల్లు లేదా అమరావతి రాజధాని బిల్లు) ఎగువ సభ వాటిని పరిశీలించి విస్తృత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. రాజ్యసభ సభ్యులను పార్లమెంటు ఎన్నుకుంటుంది, కొందరిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎన్నుకుంటారు, కొందరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. వారందరూ సరైన పరిజ్ఞానం, అనుభవం ఉండటమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. దిగువ సభకు ఎన్నిక కాలేనివారు ఎగువ సభకు ఎంపికై ఆయా వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తారు. దిగువ సభలో చేపట్టిన తొందరపాటు చర్యలను, దుందుడుకు నిర్ణయాలను నిరోధిస్తారు. దిగువ సభలో ఆధిక్యత చలాయించే నాయకుడి దయాదాక్షిణ్యాలపై ఎగువ సభ మనుగడ ఆధారపడి ఉండరాదు.

ప్రజాస్వామ్య నియంతగా మారిన జగన్మోహన్ రెడ్డి:

జగన్మోహన్ రెడ్డిలాంటి నాయకుడు దిగువ సభలో ప్రజాస్వామ్య నియంతగా మారి, ప్రజాభీష్టాలకు విరుద్దంగా స్వప్రయోజన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆయనకు లేదా దిగువ సభకు నియంత్రణ ఎగువ సభతోనే సాధ్యం. అమెరికా ప్రజాస్వామ్యమే అందుకు ఉదాహరణ. రాజ్యసభ ఏవిధంగా అయితే శాశ్వత రాజ్యాంగ సభగా ఉందో, అదేవిధంగా రాష్ట్రాలలో కూడా శాశ్వత ఎగువ సభ ఉండాలి అనడానికి కూడా ఇదే కారణం. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దంగా సాగుతున్న జగన్మోహన్ రెడ్డి స్వయం పరిపాలనే మన రాష్ట్రంలో ఈ దుందుడుకు పోకడలకు తాజా ఉదాహరణ.

ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ అప్రజాస్వామికంగా నడుపుతున్నారు. ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చివరికి కోర్టులపై, న్యాయమూర్తులపై కూడా దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారు.విమర్శలను సహించలేక పోవడం సిఎం జగన్ అసహనానికి పరాకాష్ట. సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోస్ట్ లు పెట్టిన వాళ్లనే కాకుండా వాటిని షేర్ చేసిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వృద్దులను సైతం వదలకుండా కేసులు పెట్టి, అరెస్ట్ లు చేసి తీవ్రంగా వేధిస్తున్నారు. యావత్ పోలీసు శాఖనే తమ చెప్పుచేతల్లోకి తీసుకుని అధికార పార్టీకి మద్దతుగా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసు యంత్రాంగాన్ని తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. వీళ్ల వేధింపులు తట్టుకోలేక మనోవేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. డా కోడెల శివ ప్రసాదరావు ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం.

అదే అధికార పార్టీ నాయకుల అరాచకాలపై పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వారిపై కేసులు కట్టకుండా, బాధితుల ఫిర్యాదులను చెత్తబుట్టలలో పడేస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు తెచ్చిన ప్రత్యేక చట్టాలు నిర్భయ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి నిరోధక చట్టం, దిశా బిల్లు(ఇదింకా చట్టం కాకుండానే కేసులు), అన్నింటినీ ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టడానికి దుర్వినియోగం చేస్తున్నారు. ఏపిలో భావ ప్రకటనా స్వేచ్ఛను వైసిపి ప్రభుత్వం కాలరాస్తోంది, మానవ హక్కులను యధేచ్చగా ఉల్లంఘిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచక పాలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రాజ్యాంగ పెద్దలు తక్షణమే జోక్యం చేసుకుని ఏపిలో హింసా విధ్వంసాలకు, వేధింపులను అడ్డుకోవాలి.

రాజ్యాంగ పెద్దల జోక్యమే వైసిపి రాచపుండుకు మందు:

వైసిపి హింసా, విధ్వంస కాండ ఏపిలో రాచపుండుగా మారింది. రాజ్యాంగ పెద్దల జోక్యమే వైసిపి రాచపుండుకు తక్షణ వైద్యం. వైసిపి అరాచకాలపై ఇప్పటికే గవర్నర్ గారికి వినతులు అందించాం. త్వరలోనే కేంద్రానికి, రాజ్యాంగ పెద్దలకు కూడా వినతులు పంపిస్తాం. వైసిపి అరాచక పాలనపై రాజీలేని పోరాటం చేస్తాం. వైసిపి హింసా విధ్వంసాలపై అన్నివర్గాల ప్రజలు ఆలోచించాలి. వైసిపి అరాచకాలకు తగిన గుణపాఠం చెప్పాలని యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story