Fact Check : ఆ ఖడ్గం మహా రాణాప్రతాప్‌కు సంబంధించిందేనా..!!
By న్యూస్‌మీటర్ తెలుగు
భారతదేశ చరిత్రలో మహా రాణాప్రతాప్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆయన గొప్పదనం ఎన్నో పుస్తకాలలో ప్రస్తావించారు. ఆయన ఆహార్యం, ఆయన ఖడ్గం ఎంతో ప్రత్యేకమని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. తాజాగా ఓ పొడవాటి ఖడ్గం.. అది మహారాణా ప్రతాప్ కు చెందినదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ట్విట్టర్ యూజర్ ఒకరు.. "ఈ ఫోటోలో ఉన్నది మహారాణా ప్రతాప్ కు చెందిన ఖడ్గం.. ఆ ఖడ్గం బరువు 50కేజీల పైమాటే.. తన ప్రత్యర్థి ఎవరైనా నిరాయుధుడైతే తన ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ఇంకో ఖడ్గంతో యుద్ధ రంగంలో పోరాడేవాడు.. ఆయన బలం ఎంతో అర్థం చేసుకోవచ్చు.. కానీ ఈ విషయం మన చిత్ర పుస్తకాల్లో పెద్దగా ప్రస్తావించలేదు" అని రాసుకుంటూ వచ్చారు.
దీన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడమే కాకుండా.. ఈ ఖడ్గాన్ని మహారాణా ప్రతాప్ హల్దీ ఘాట్ యుద్ధంలో ఉపయోగించాడని చెప్పుకొచ్చారు.
నిజనిర్ధారణ:
పైన చెబుతున్నవి 'అబద్ధం'
ఫోటోలో ఉన్న ఖడ్గాన్ని చూడగా దాని హ్యాండిల్ దగ్గర అరబిక్ పదాలు ఉన్నాయి. ఈ ఫోటోను తీసుకుని గూగుల్, యాండెక్స్ లో న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఈ ఫోటోను షేర్ చేశారు.
archeoveyasam అనే ఇంస్టాగ్రామ్ పేజ్ లో ఈ కత్తికి సంబంధించిన సమాచారాన్ని తెలిపారు. సెప్టెంబర్ 2019న ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసి.. ఈ కత్తి బాబ్డిల్(ముహమ్మద్ xii) కి చెందినదని తెలిపారు.
ఎమిరేట్ ఆఫ్ గ్రనాడా, స్పెయిన్ ను పాలించిన చివరి నస్రిద్ రూలర్ గా బాబ్డిల్ ను చెప్పుకొంటారు. 1482 నుండి 1492 వరకూ పాలించాడు. 1491 లో గ్రనాడా మాత్రమే ముస్లింల ఆధీనంలో ఉన్న నగరం.. ఆ తర్వాత క్రిస్టియన్స్ ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నారు. చాలా సోషల్ మీడియా అకౌంట్ లలో ఆ ఖడ్గం బాబ్డిల్ కు చెందినదని పోస్టు చేశారు.
Sword-site.com అనే వెబ్సైట్ లో ఈ ఖడ్గానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. “Jinete Sword of Boabdil Last Nasarid Emir of Granada” అంటూ ఆ ఖడ్గం కింద ఉంది... ఇది బాబ్డిల్ కు చెందిన కత్తి అని తెలిపారు.
https://sword-site.com/thread/317/jinete-sword-boabdil-nasarid-granada
Unusual Historicals అనే వెబ్ సైట్ లో కూడా ఈ ఖడ్గం గురించి ప్రస్తావించారు. అందులో “The Moorish Loss of Muslim Granada in 1492” అని రాసుకుని వచ్చారు. ప్రస్తుతం ఈ ఖడ్గం ప్యారిస్ లోని మ్యూజియం ఆఫ్ క్లూనీలో ఉంది.
http://unusualhistoricals.blogspot.com/2015/01/the-moorish-loss-of-muslim-granada-in.html
సోషల్ మీడియాలో ఆ ఖడ్గం మహారాణా ప్రతాప్ కు చెందినదని చెబుతున్నదంతా పచ్చి అబద్ధం.