తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 April 2020 4:55 AM GMT
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సోమవారం సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది.

విజయసేన్‌రెడ్డి ప్రొఫైల్:

విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్‌ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు. ఉమ్మడి ఏపీ మానవహక్కుల కమిషన్‌ తొలి చైర్మన్‌గా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు లోకాయుక్తగా పనిచేసిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కి విజయ్‌సేన్‌రెడ్డి మేనల్లుడు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపాక.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తిగా నియమితులుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారి పేర్లను సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు కొలీజియం సిఫారసు చేసిన ఆరుమంది జాబితాలో కృష్ణమోహన్, సురేష్‌ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్‌ నర్సింహారావు, కె.మన్మథరావులు ఉన్నారు. ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారి పేర్లను కేంద్రానికి పంపింది. తెలంగాణ, ఎపి రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కోల్‌కతా హైకోర్టుల్లోనూ న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టుల కొలీజియం సిఫారసు చేసింది.

Next Story
Share it