ఎంబీఎస్‌ జ్యువెల్లర్స్‌ అధినేత సుఖేష్‌ గుప్తా కోసం పోలీసుల గాలింపు

By సుభాష్  Published on  21 March 2020 5:03 AM GMT
ఎంబీఎస్‌ జ్యువెల్లర్స్‌ అధినేత సుఖేష్‌ గుప్తా కోసం పోలీసుల గాలింపు

ఎంబీఎస్‌ జ్యువెల్లర్స్‌ అధినేత సుఖేష్‌గుప్తా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్‌ బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో సుఖేష్‌గుప్తా తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందడంతో ఆ ఇంటిని చుట్టు ముట్టి తనిఖీలు చేపట్టారు. కాగా, సుఖేష్‌గుప్తా ఆయన కంపెనీని చీటింగ్‌ చేసినట్లు బంజారాహిల్స్‌ లోని ఎస్‌ఆర్‌ఈఐ ఎక్యూప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

2018 జూన్‌లో ఎస్‌ఆర్‌ఈఐ వద్ద బషీర్‌బాగ్‌లోని ఆషి రియాల్టర్స్‌ కు చెందిన సుఖేష్‌ గుప్తా, నీతు గుప్తా, ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సురేష్‌ కుమార్‌, రవిచంద్రన్‌లు రూ. 110 కోట్ల రుణాన్ని తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, 2018 అక్టోబర్‌ నుంచి ప్రతీ మూడు నెలలకు ఓ ఇన్‌స్టాల్‌మెంట్‌ చొప్పున చెల్లిస్తూ మొత్తం నాలుగు దఫాల్లో వడ్డీతో సహా రుణాన్ని చెల్లించేందుకు సుఖేష్‌ గుప్తా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ రుణానికి సంబంధించి ష్యూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీభాగ్‌ ప్యాలెస్‌ను చూపిస్తూ 2018 జూలై 15న అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎస్‌ఆర్‌ఈఐ నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో సుఖేష్‌ గుప్తా విఫలం కావడంతో ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరుకుంది. ఇక రుణం చెల్లించకపోవడంతో గత ఏడాది డిసెంబర్‌ 30న హఫీజ్‌పేటలో ఉన్న స్థలాన్ని రూ. 102.6 కోట్లకు ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ వేలం వేసింది. ఇక మిగిలిన సొమ్ము రికవరీ కోసం కోఠిలోని నజ్రీభాగ్‌ను వేలం వేయాలని ప్రయత్నించగా, సుఖేష్‌ గుప్తా అప్పటికే ఈ స్థలాన్ని ఐరిష్‌ హస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ గుర్తించింది.

Advertisement

సుఖేష్‌ గుప్తాపై గత నెల 28వ తేదీన సీసీఎస్‌ పోలీసులకు వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో సుఖేష్‌ గుప్తా, నీతు గుప్తా, రవీంద్రన్‌, సురేష్‌ కుమార్‌లపై ఐపీసీలోని 420, 406 డెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా సీసీఎస్‌ ఏసీపీ హరికృష్ణ మాట్లాడుతూ.. వ్యాపారవేత్త సుఖేష్‌ గుప్తా కలకత్తా బేస్డ్‌ కంపెనీలో రుణం తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు అందిందని, సిరి ఫైనాన్స్‌ కంపెనీ నుంచి 110 కోట్లు రుణం తీసుకుని మోసగించాడని, దీంతో ఫైనాన్స్‌ కంపెనీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిందని, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు.

Next Story
Share it