అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 6:40 AM GMTఅమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. 200 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలందరికీ మేమంతా మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాము. మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదు. ప్రభుత్వం నిరంతరంగా ఉంటుంది. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డిగారు సీఎం అయ్యాక మడమ తిప్పడం విచారకరం' అని సుజనా ట్వీట్లు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిలో చట్టసభలు, విశాఖలో పరిపాలన, కర్నూలులో హైకోర్టు ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. గ్రామాల్లో టెట్లు వేసుకొని నిరసనలు తెలియజేశారు. కరోనా కాలంలో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిని మార్చొద్దు అని చెప్పి నిరసనలు మొదలుపెట్టి నేటికీ 200 రోజులు అయ్యింది. దీంతో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు రాజధాని ప్రాంత గ్రామంలో ఎవరింట్లో వాళ్ళు నిరసన, నిరాహార దీక్షలు చేస్తున్నారు.
�