ఐపీఎల్ నిర్వాహకులను టెన్షన్ పెడుతున్న అబుదాబీ నిబంధనలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 6:18 PM IST
ఐపీఎల్ నిర్వాహకులను టెన్షన్ పెడుతున్న అబుదాబీ నిబంధనలు..!

సాధారణంగా ఐపీఎల్ షెడ్యూల్ కొన్ని నెలల ముందే బయటకు వస్తూ ఉంటుంది. ఈసారి ఐపీఎల్ భారత్ లో కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలని బీసీసీఐ అన్ని విధాలా సన్నద్ధమవుతున్న సమయంలో అబుదాబీలో ఉన్న నియమనిబంధనలు ఐపీఎల్ నిర్వాహకులను సస్పెన్స్ లో పెడుతున్నాయి.

ఐపీఎల్- 2020 సీజన్ సెప్టెంబ‌ర్ 19వ తేదీన డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌డంతో మొదలవుతుంది అన్న విషయం మినహా మరే విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదు. ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

అబుదాబిలో ఉన్న క‌ఠిన‌మైన కోవిడ్ నిబంధ‌న‌ల వ‌ల్లే.. మ్యాచ్ షెడ్యూల్ ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. దుబాయ్‌, షార్జాల‌తో పోలిస్తే.. అబుదాబిలో కోవిడ్ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినంగా ఉండడంతో అక్క‌డ మ్యాచ్‌లు నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న ఆలోచ‌న‌ల్లో బీసీసీఐ ఉన్న‌ట్లు కథనాలు వస్తున్నాయి. దుబాయ్‌లోనే క్వారెంటైన్‌లో ఉన్నారు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్‌. అబుదాబీలోని అధికారులతో చర్చించి ఈ నెల ముగింపున ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో పాల్గొనే 8 జ‌ట్లలో ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు అబుదాబి బేస్‌గా ఉండగా.. మిగిలిన ఆరు జ‌ట్లు దుబాయ్‌లో ఉంటున్నాయి. అయిదు రోజుల‌కు ఒక‌సారి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బీసీసీఐ నిబంధ‌నలు పెట్టింది. అబుదాబిలో మాత్రం ఆ నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినంగా ఉన్నాయి. అబుదాబిలోకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఎంట్రీ పాయింట్ వ‌ద్ద క‌చ్చితంగా ప‌రీక్ష చేయించుకోవాలి. 50 దిర్‌హ‌మ్‌లు చెల్లిస్తే వెంట‌నే ప‌రీక్ష చేస్తారు. ఆ రిపోర్ట్ 48 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది.

ఈ నేప‌థ్యంలో దుబాయ్ మ్యాచ్‌ల‌ను సింగిల్ లెగ్‌లో పూర్తి చేయాల‌ని బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తోంది.. దుబాయ్ బేస్‌లో ఉన్న జ‌ట్లతో అబుదాబిలో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డం కష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్‌ల అంశంలో బీసీసీఐ తెగ తర్జన భర్జన పడుతోంది. ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయడానికి పెద్ద సమయం తీసుకోకపోవచ్చని చెబుతూ ఉన్నారు. అబుదాబీ నిబంధనలు ఐపీఎల్ షెడ్యూల్ విడుదలకు మోకాలడ్డుతున్నాయి.

Next Story