కోహ్లీ, రోహిత్‌, ధోని సహా 50 మంది స్టార్‌ క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 7:19 AM GMT
కోహ్లీ, రోహిత్‌, ధోని సహా 50 మంది స్టార్‌ క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగం అయ్యే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు నాడా(జాతీయ డోపింగ్‌ నిరోధక సంఘం) సిద్దమవుతోంది. ఇప్పటికే నాడా యూఏఈకి చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీతో బప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరనున్న టోర్నీలో మూడు విడుతల్లో క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ, మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనితో సహా 50 మంది స్టార్‌ క్రికెర్ల నుంచి శాంపిళ్లను సేకరించనున్నారు.

ఇందుకోసం జాతీయ డోపింగ్ నిరోధక విభాగం యూఏఈలో ఐదు డోప్ కంట్రోల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఐపీఎల్ జరిగే మూడు వేదికలు అయిన దుబాయ్, అబుదాబి, షార్జాతో పాటుగా అక్కడి ఐసీసీ అకాడమీ లో వీటిని ఏర్పాటు చేసింది. మ్యాచ్‌లు ఆడేటప్పుడు, సాధన చేసేటప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆటగాళ్ల మూత్రమే కాకుండా రక్త నమూనాలను సేకరించేందుకు నాడా మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. ఈ మొత్తం డోపింగ్‌ నిరోధక కార్యకాలాపాలను నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను నాడా నియమించనుంది. ఈ బృందంలో నాడా సీనియర్ అధికారితోపాటు డీసీవో కేంద్రాల నుంచి ఇద్దరు, యూఏఈ యాంటీడోపింగ్ సభ్యులు ఇద్దరు ఈ టీమ్ లో ఉంటారు. విడతలవారీగా ఈ బృందాలు యూఏఈ చేరుకొని పరీక్షలు నిర్వహించనున్నాయి.

ఇక ఐపీఎల్‌ పాల్గొనేందుకు అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాద్యత ప్రాంచైజీలకి అప్పగించింది బీసీసీఐ. ప్రస్తుతం ఆటగాళ్లు అంతా క్వారంటైన్‌లో ఉన్నారు. వారికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగిటివ్‌ వచ్చిన ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్‌లో ఆడతారు. ఒకవేళ ఎవరైనా ఆటగాడికి కరోనా వస్తే.. ఆ ఆటగాడిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటాడు. తరువాత రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. నెగిటివ్‌ వస్తేనే తిరిగి జట్టుతో కలుస్తాడు. ఇక టోర్నీ జరిగే సమయంలో కూడా ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్లకి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఆ జట్టు ఫ్రాంఛైజీలకే అప్పగించింది బీసీసీఐ.

Next Story