Fact Check : అనాథలను దత్తత తీసుకున్న ముస్లిం వ్యక్తి.. వారికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి సాగనంపాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 5:43 PM IST
Fact Check : అనాథలను దత్తత తీసుకున్న ముస్లిం వ్యక్తి.. వారికి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి సాగనంపాడా..?

ఇద్దరు అమ్మాయిలు పెళ్లి దుస్తుల్లో ఉండగా.. వారిని హత్తుకుని ఏడుస్తూ ఒక ముస్లిం వ్యక్తి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

'మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ కు చెందిన ఓ ముస్లిం వ్యక్తి అనాథలైన అక్క చెల్లెళ్లను దత్తత తీసుకుని వారికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసాడు. సాగనంపే సమయంలో అక్కడ చోటు చేసుకున్న ఘటన ఇది. అతడు మానవత్వంతో చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు' అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

A1

ఈ ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ లో కూడా వైరల్ అయ్యాయి.

నిజమెంత:

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన 'బాబాభాయ్ పఠాన్' ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని వారికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారన్నది 'అబద్ధం'.

ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిల పేర్లు గౌరీ, సావిత్రి. వారిద్దరూ అనాథలు కాదు. బాబాభాయ్ పఠాన్ ఉంటున్న వీధిలోనే వీరు కూడా నివసిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయిల అమ్మ బాబాభాయ్ పఠాన్ ను తన సొంత కొడుకుగా భావిస్తూ ఉంటుంది. గౌరీ, సావిత్రిలకు అన్నయ్యలా బాబాభాయ్ పఠాన్ చిన్నప్పటి నుండి అండగా ఉన్నాడు.

పాపులర్ మరాఠీ బ్లాగర్ సమీర్ గైక్వాడ్ ఈ వార్తను ఫేస్ బుక్ లో మొదటి సారి పోస్టు చేశారు. ఈ పెళ్లి సమయంలో అన్న చేయాల్సిన పనులను బాబాభాయ్ పఠాన్ నిర్వర్తించాడు. ప్రతి ఏడాది బాబాభాయ్ పఠాన్ కు గౌరీ, సావిత్రిలు రాఖీ కట్టేవారు. వారికి సోదరులు లేకపోవడంతో బాబాభాయ్ పఠాన్ ను సొంత అన్నలా భావించేవారు. వారికి పెళ్లి చేస్తున్న సమయంలో కూడా ఆ పెళ్ళిలో నిర్వర్తించాల్సిన సంప్రదాయాలను బాబాభాయ్ పఠాన్ తన చేతుల మీదుగా చేశాడు. మేనమామ, అన్న చేయాల్సిన పనులను పెళ్లిలో బాబాభాయ్ పఠాన్ దగ్గరుండి చేశాడు అని సమీర్ గైక్వాడ్ తెలిపారు.

ఈ ఫోటోలపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా స్థానిక వెబ్సైట్స్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించాయి. Maharashtra Times కథనం ప్రకారం సవిత భుసారి భర్త ఆమె ఇద్దరి కూతుళ్లను కొన్ని సంవత్సరాల కిందటే వదిలి వెళ్లిపోయాడు. దీంతో తన కూతురి పెళ్ళిలో చేయాల్సిన సంప్రదాయాలను ఎవరు చేస్తారు అని ఎదురుచూస్తున్న సమయంలో బాబాభాయ్ పఠాన్ ముందుకు వచ్చాడు. సవిత సోదరుడు చేయాల్సిన అన్ని పనులను పెళ్ళిలో చేశాడు బాబాభాయ్ పఠాన్.

Zee 24 Taas కూడా వీడియోను పోస్టు చేసింది. ఈ ఘటనలో నిజా నిజాలు ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఆ వీడియోలో సవిత తన తల్లిదండ్రులు, సోదరుడు చనిపోయారని చెప్పుకొచ్చింది. నా సోదరుడు పెళ్ళిలో చేయాల్సిన పనిని బాబాభాయ్ పఠాన్ చేశారని వివరించింది.

Opindia, boomlive కూడా వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదని తెలిపాయి.

బాబాభాయ్ పఠాన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని, వారికి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎలాంటి నిజం లేదు'. బాబూభాయ్ పఠాన్ వారికి అన్నలాగా, మేనమామలా పెళ్ళిలో కార్యక్రమాలు నిర్వహించాడు.

Next Story