రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌తో పాటు జిల్లా స‌రిహ‌ద్దులు మూసివేయండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2020 2:12 PM GMT
రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌తో పాటు జిల్లా స‌రిహ‌ద్దులు మూసివేయండి

కరోనా వైరస్(కొవిడ్‌-19) వ్యాప్తి నియంత్రించేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో తమ సొంత రాష్ట్రాలకు వలస కూలీలు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలపై కేంద్రం మరోసారి రాష్ట్రాలకు సూచనలు చేసింది. సొంత రాష్ట్రాలకు వస్తున్న వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది. ఈ మేరకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వ‌హించారు.

లాక్‌నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని, కూలీలు రాష్ట్రాలు , న‌గ‌రాలు దాట‌కుండా స‌రిహ‌ద్దుల‌ను మూసివేయాల‌ని ఆదేశించింది. జాతీయ ర‌హ‌దారుల ప‌క్క‌నే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించింది. కాగా ఇప్ప‌టికే త‌మ సొంత రాష్ట్రాల‌కు ప‌య‌న‌మైన వ‌ల‌స కూలీల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలోని క్వారంటైన్ల‌కు త‌ర‌లించాల‌ని ఈ చ‌ర్య‌తో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా నివారించవ‌చ్చున‌ని తెలిపింది.

రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దుల‌ను మూసివేయాల‌ని, కేవ‌లం నిత్యావస‌ర స‌రుకుల ర‌వాణాకు మాత్ర‌మే అనుమ‌తించాల‌ని ఆదేశించింది. జిల్లా స‌రిహ‌ద్దుల‌ను కూడా మూసివేయాల‌ని, నిబంధ‌న‌ల‌ను ఉల్లంగించి ప్ర‌యాణాలు చేస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. విద్యార్థులు, కార్మికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయాల‌ని ఒత్తిడి చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపింది.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌డంతో ప‌లు ప్రాంతాల్లోని వ‌ల‌స కూలీలు ప‌నులు లేక త‌మ సొంత గ్రామాల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. అయితే మార్గ‌మ‌ధ్యంలో ప‌లు చెక్‌పోస్టులు వ‌ద్ద పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో అక్క‌డే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు వారిని వెన‌క్కి పంపుతున్నారు.

Next Story