ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకు దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా ఈ వైరస్‌ విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 979 మంది కరోనా వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతుండగా.. వీరిలో 25మంది మృతి చెందారు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో ఒకరు, గుజరాత్‌లో ఒకరు చొప్పున చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో గుజరాత్‌లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

Also Read :లాక్‌ డౌన్‌ కఠిన నిర్ణయమే.. అది మీ రక్షణ కోసమే

దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మృతుల వివరాలు పరిశీలిస్తే.. మహారాష్ట్రలో ఆరుగురు, గుజరాత్‌లో ఐదుగురు, కర్ణాటక – 3, ఢిల్లి -2, మధ్య ప్రదేశ్‌ -2 , జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్‌, బిహార్‌, బెంగాల్‌, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పు మృతి చెందారు. ఇదిలాఉంటే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఆదివారం కొత్తగా మరో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 193కు చేరింది. మధ్య ప్రదేశ్‌లోనూ కొత్తగా ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 39కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read :భారత్‌లో వెయ్యికి చేరువలో.. కరోనా పాజిటివ్‌ కేసులు

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 67కు చేరగా, వీరిలో ఒకరు మృతి చెందారు. 10మందికి పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అటు ఏపీలోనూ వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. ఏపీలో 19మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అనుమానితులు కొందరు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్