సాధారణ భక్తులకు నేటి నుంచి శ్రీవారి దర్శనం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 5:41 AM GMT
సాధారణ భక్తులకు నేటి నుంచి శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం నుంచి సాధారణ భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. దీంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జూన్‌ 8 నుంచి మూడు రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రోజుకు ఆరువేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనుంది. అందులో మూడువేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కాగా.. మరో మూడు వేల మందికి ఉచిత టైంస్లాట్‌ టోకెన్లు అందించింది. కొండపైకి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీలకు కూడా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 7.30 వరకు గంట పాటు వీఐపీ దర్శనానికి కేటాయించింది.

టోకెన్ల కోసం కిలోమీటర్ల మేర భక్తులు..

తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరూ భౌతిక దూరం పాటించక పోవడంతో అధికారులు తలపట్టుకున్నారు. అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది. నిన్న సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు.

Next Story
Share it