ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం.. నిబంధనలివే..

By సుభాష్  Published on  5 Jun 2020 7:45 AM GMT
ఈ నెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం.. నిబంధనలివే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల అన్ని రంగాలతోపాటు ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇక ఈనెల 8వ తేదీ నుంచి అన్ని ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండున్నర నెలల నుంచి తిరుమల ఆలయ దర్శనాలు నిలిచిపోయాయి. ఈనెల 11వ తేదీ నుంచి తిరుమలలో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజుకు ఎంత మందికి దర్శనాలు కల్పించాలనే విషయమై ఇంకా పరిశీలిస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులు శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అన్నారు.

రోజుకు 3వేల మంది భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా రాత్రివేళ కర్ఫ్యూ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక వీఐపీ దర్శనం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకే కేవలం గంట మాత్రమే ఉంటుందన్నారు. అలాగే దర్శనానికి ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోని వారు నేరుగా వచ్చి రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటామని, 65 సంవత్సరాలు దాటిని వృద్ధులు, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అనుమతి లేదని కేంద్రం తెలిపిందని, ఇక్కడ అదే పాటిస్తున్నామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి వచ్చే భక్తులకు దర్శనానికి రావొద్దని చైర్మన్‌ సూచించారు.

అలాగే అలిపిరి ద్వారా మాత్రమే కాలినడకన భక్తులకు అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్ల వైపు నుంచి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. రోజు పరిమితి సంఖ్యలో దర్శనాలు ఉంటాయని, ఘాట్‌ రోడ్డులో వాహనాలకు ఉదయం5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే అన్నప్రసాదం దగ్గర కూడా భౌతిక దూరం పాటించాలన్నారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, వాహనాల శానిటైజేషన్‌ ఉంటుందన్నారు. అలిపిరి, జీఎన్‌సీ వద్ద ర్యాండమ్‌గా భక్తుల నుంచి శాంపిల్స్‌ సేకరిస్తామన్నారు.

Next Story
Share it