లంక క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్ట్..
By తోట వంశీ కుమార్
శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సైక్లిస్టును తన కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సైక్లిస్టుకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో పోలీసులు మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే..కొలంబో శివారులోని పానాదుర ప్రాంతంలో ఈ ఉదయం కుశాల్ మెండిస్ ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా.. కారు, సైకిల్‌పై వెళ్తున్న 64 ఏళ్ల వ్యక్తిని ఢీకొంది.
ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. అతి వేగంతో కుశాల్ కారుని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే మెండిస్ మద్యం తాగి ఉన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. రేపు అతడిని స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. లంక తరుపున ఇప్పటివరకు 76 వన్డేల్లో 2,167 పరుగులు.. 44 టెస్టుల్లో 2,995 పరుగులు.. 26 టీ20ల్లో 484 పరుగులు చేశారు.