కేకేఆర్ కెప్టెన్సీ నుండి గంగూలీని తప్పించింది అతడే: ఆకాష్ చోప్రా
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 2:50 AM GMTఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత కప్ ను అందుకుంది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టే..! ఈ జట్టు జర్నీలో ఆకాష్ చోప్రా కూడా సభ్యుడే. సౌరవ్ గంగూలీని కేకేఆర్ కెప్టెన్సీ పగ్గాల నుండి ఎవరు తప్పించారో ఆకాష్ చోప్రా తాజాగా బయటపెట్టాడు. 2008 లో ఐపీఎల్ మొదలైనప్పుడు సౌరవ్ గంగూలీ కేకేఆర్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఎందుకో ఆ తర్వాత కెప్టెన్ గా కొనసాగలేకపోయాడు. 2008 లో కేకేఆర్ జట్టుకు జాన్ బుకానన్ కోచ్ గా వ్యవహరించాడు. సిరీస్ మొదలైనప్పుడు బుకానన్, గంగూలీల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉండేది.. కానీ టోర్నమెంట్ కొనసాగే కొద్దీ ఆ బంధం క్షీణించిందని ఆకాష్ చోప్రా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బుకానన్ వర్కింగ్ స్టైల్ వైవిధ్యమైనదని, గంగూలీ స్వభావం వేరేలా ఉండేదని.. ఒక సీజన్ ముగిశాక 2009 సీజన్ లో గంగూలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకూడదని బుకానన్ మేనేజ్మెంట్ కు తెలిపాడు. దీంతో రెండో సీజన్ లో కెప్టెన్సీని బ్రెండన్ మెక్ కాలమ్ అందుకున్నాడు. మొదటి సీజన్ లో కేకేఆర్ ఆరో స్థానం సాధించగా, రెండో సీజన్ లో చివరి స్థానంలో నిలిచిందని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత బుకానన్ కూడా కేకేఆర్ ను వీడాల్సి వచ్చింది. ముగ్గురు కెప్టెన్లు అంటూ బుకానన్ చేసిన ప్రయత్నాలు కూడా కలిసి రాలేదు. ఇక బుకానన్ కూడా తన చుట్టూ తన వాళ్ళే ఉండాలని కోరుకునే వాడు. సపోర్ట్ స్టాఫ్ కింద తన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు బుకానన్. కేకేఆర్ ప్రదర్శన కూడా అంతగా బాగుండకపోవడంతో బుకానన్ ను తప్పించారని ఆకాష్ చోప్రా తెలిపాడు.
ఐపీఎల్ కొన్ని సీజన్లలో కేకేఆర్ పెద్దగా ప్రభావం చూపలేదు. గంభీర్ ను కెప్టెన్ చేయగా కేకేఆర్ కు అదృష్టం కలిసి రావడమే కాకుండా సమిష్టిగా రాణించడం కూడా జరిగింది. గంభీర్ రెండు సార్లు కేకేఆర్ కు ఐపీఎల్ టైటిల్స్ ను అందించాడు. 2012, 2014 లలో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేకేఆర్ కు దినేష్ కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉండగా, బ్రెండన్ బెక్‌కలమ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు.