భారత ఆటగాళ్లపై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 7:57 AM GMT
భారత ఆటగాళ్లపై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

టీమ్‌ఇండియా క్రికెటర్లపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు ఆడినప్పుడు మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు తమను క్షమించమని అడిగేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే.. అది ఇప్పుడు కాదని పాక్‌ ఆధిపత్యం చెలాయించే రోజుల్లోనని చెప్పుకొచ్చాడు. క్రిక్‌కాస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు.

భారత జట్టుపై ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాడినన్నాడు. ఎన్నోసార్లు టీమ్‌ఇండియాను తేలిగ్గా ఓడించామని, దాంతో మ్యాచ్‌లు పూర్తి అయ్యాక వాళ్లొచ్చి క్షమాపణలు కోరేవారన్నాడు. భారత్‌, ఆస్ట్రేలియాతో ఆడే సందర్భాల్లో బాగా ఎంజాయ్‌ చేసేవాడిని. ఎందుకంటే రెండు ఉత్తమ జట్లు కాబట్టి చాలా ఒత్తిడి ఉంది. ఆయా దేశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్లో ఆడటమనేది చాలా పెద్ద విషయం అని అన్నాడు.

భారత్‌పై తన అత్యుత్తమ ఇన్నింగ్‌ గురించి అడుగగా.. 1999 చెన్నై టెస్టులో సాధించిన శతకం ఎంతో ప్రత్యేకమైందన్నాడు. టీమ్‌ఇండియాపై నేను ఎప్పటికి గుర్తిచుకునే ఇన్నింగ్స్‌ అదే. ఆ రోజు నేను 141 పరుగులు చేశాను. ఆ పర్యటనలో అప్పటి కెప్టెన్‌ వసీం అక్రమ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ నాకు అండగా నిలిచారని అన్నారు. అదెంతో కష్టతరమైన పర్యటన అని అయితే.. ఆ ఇన్నింగ్స్‌ మాత్రం చాలా ముఖ్యమైందని అఫ్రిది అన్నాడు. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 42/2 కష్టాల్లో ఉన్నప్పుడు అప్రిధి 141 పరుగులతో రాణించాడు. దీంతో పాకిస్థాన్‌ 286 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా.. అప్రిధి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి.

భారత్‌పై 67 వన్డేలు ఆడిన అఫ్రిధి 1524, 8 టెస్లుల్లో 709 పరుగులు సాధించాడు. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఇప్పటి వరకు 132 వన్డేలు జరుగగా.. ఇండియా 55 మ్యాచుల్లో విజయం సాధించగా.. పాకిస్థాన్‌ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య 59 టెస్లులు జరగగా.. పాకిస్థాన్‌ 12 గెలువగా.. 9 మ్యాచుల్లో ఇండియా విజయం సాధించింది. 38 టెస్టులు డ్రా ముగిసాయి.

Next Story