శ్రీదేవి ఇంట్లో ఇప్పుడు ఆమె స్థానం ఎవరిది?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2020 9:26 AM ISTఎదుగుతున్న పిల్లలకు తల్లి అవసరం ఎంతగా ఉంటుందో తెలిసిందే. ఆ దశలో తల్లిని కోల్పోతే ఉండే బాధే వేరు. ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా చాలా కష్టం. దిగ్గజ నటి శ్రీదేవి.. తన కూతుళ్లకు, భర్తకు తన అవసరం చాలా ఉన్న సమయంలో హఠాత్తుగా కన్నుమూశారు. ఆమె చనిపోయి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. ఆమెను భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషి ఎంతగా మిస్సవతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే శ్రీదేవి మరణానంతరం ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని కుటుంబం బాగోగులు చూడాలి కదా. ఆ పనిని తనే చేస్తున్నట్లు చెప్పింది జాన్వి. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు తన మీదే ఎక్కువ ఆధారపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. లాక్ డౌన్ టైంలో మరింతగా తాను కుటుంబంపై దృష్టిపెట్టానని.. తనపై వాళ్లిద్దరూ ఎంతగా ఆధారపడుతున్నారో తనకు ఇప్పుడు బాగా అర్థమైందని జాన్వి చెప్పింది.
ఓ ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో అమ్మ లాగా అందరి యోగక్షేమాలు చూసుకునే మహిళను నేనవుతానని ఎప్పుడూ అనుకోలేదు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో వాళ్లు నాపై ఎంతగా ఆధారపడుతున్నారో అర్థమైంది. గడిచిన రెండేళ్లలో వాళ్లతో ఎక్కువ సమయం గడిపింది ఇప్పుడే. నాన్న ఏం తింటారు.. ఖుషి ఎందుకు ఎక్కువ సమయం నిద్రపోతుంది.. పనివాళ్లు లాక్ డౌన్ టైంలో కూరగాయల్ని ఎలా తెస్తున్నారు.. శుభ్రంగా కడుగుతున్నారా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా.. ఇలా ప్రతి విషయాన్నీ పర్యవేక్షిస్తున్నా.. నేనిక్కడ లేకుంటే ఎలా ఉండేదో అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ప్రస్తుతం నాన్న, చెల్లి నాపై ఆధారపడుతున్న సంగతి అర్థమయ్యాక నా బాధ్యత మరింత పెరిగింది’’ అని జాన్వి చెప్పింది. తన తల్లి మరణించిన 2018లోనే ‘ధడక్’ లాంటి సూపర్ హిట్ మూవీతో కథానాయికగా పరిచయమైన జాన్వి.. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.