పూజా హెగ్డే అకౌంట్ నుండి సమంతపై అభ్యంతకర వ్యాఖ్యలు.. నిజమేమిటంటే..!

By సుభాష్  Published on  28 May 2020 9:28 AM GMT
పూజా హెగ్డే అకౌంట్ నుండి సమంతపై అభ్యంతకర వ్యాఖ్యలు.. నిజమేమిటంటే..!

సోషల్ మీడియాలో తమకు అంతమంది ఫాలోవర్లు, ఇంతమంది ఫాలోవర్లు అని సెలెబ్రిటీలు తెగ ఆనందపడుతూ ఉంటారు. కానీ వారి సోషల్ మీడియా అకౌంట్ లకు ఉండే కష్టాలు ఎన్నో ఉంటాయి. పొరపాటున అకౌంట్ హ్యాకింగ్ కు గురై.. ఎవరి గురించైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు పోస్టులు వస్తే మాత్రం చాలా కష్టమే..! తాజాగా హీరోయిన్ పూజా హెగ్డేకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్ కు గురవ్వడమే కాకుండా.. అందులో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్టు చేశారు.

పూజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని గుర్తించి వెంటనే 'తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని' తెలిపింది. ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని, అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని సూచించింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసిందని తెలుపుతూ పూజా మరో ట్వీట్ చేసింది. తన నుండి ఏదైనా మెసేజీ వచ్చినా.. పోస్టులు పెట్టినా అది తనది కాదని చెప్పుకొచ్చింది పూజా. కొద్ది సేపటి తర్వాత డిజిటల్ టీం సాయంతో తన అకౌంట్ పునరుద్దరించారని పూజా హెగ్డే తెలిపింది. కష్టపడి పని చేసిన టెక్నికల్‌ టీంకి ధన్యవాదాలు తెలిపింది. హ్యాక్ అయిన సమయంలో ఉన్న పోస్ట్‌లు, మేస్సేజ్‌లని తొలగించినట్టు తెలిపింది. పూజా హెగ్డేకు దక్షిణాదిన భారీ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోలతో ఆమె నటిస్తూ ఉండడంతో పాటూ.. అమ్మడి క్యూట్ నెస్ ను చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో పూజా హెగ్డేకు 10.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Next Story