విలియమ్స్ విధ్వంసం.. 304 ప‌రుగుల తేడాతో వ‌న్డే క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే భారీ విజ‌యం

Zimbabwe won by 304 runs Against US. ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2023 టోర్నీలో జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ సీన్ విలియమ్స్ బ్యాట్‌తో విధ్వంసం

By Medi Samrat
Published on : 26 Jun 2023 8:43 PM IST

విలియమ్స్ విధ్వంసం.. 304 ప‌రుగుల తేడాతో వ‌న్డే క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే భారీ విజ‌యం

ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2023 టోర్నీలో జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ సీన్ విలియమ్స్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. నేపాల్‌పై వేగవంతమైన సెంచరీ చేసిన విలియమ్స్.. అమెరికాపై మరో భారీ శ‌త‌కాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ద్వారా విలియమ్స్ ప‌లు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. విలియమ్స్ రాణించ‌డంతో అమెరికాతో జ‌రిగిన‌ మ్యాచ్‌లో 408/6 భారీ స్కోరు చేసింది. విలియమ్స్ 101 బంతుల్లోనే 174 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే కెప్టెన్ 21 ఫోర్లు, 5 సిక్స‌ర్లతో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. సీన్ విలియమ్స్ చేసిన 174 ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ చరిత్రలో జింబాబ్వే తరఫున మూడవ అత్యధిక ఇన్నింగ్స్‌గా నిలిచింది.

కెప్టెన్ సీన్ విలియమ్స్ సెంచరీ సాధించడంతో జింబాబ్వే వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 400 పరుగుల మార్క్‌ను దాటింది. అమెరికాపై తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే స్కోరు బోర్డులో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. జోయ్‌లార్డ్ గుంబీ 78 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన రియాన్ బర్ల్ కేవలం 16 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. సికందర్ రజా 27 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అనంత‌రం ఛేద‌న‌కు దిగిన అమెరికా జ‌ట్టు కేవ‌లం 25.1 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో జింబాబ్వే 304 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో రెండ‌వ అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. 2023లో 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించిన భార‌త్ మొద‌టి అతిపెద్ద విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.


Next Story