రెండుసార్లు విశ్వ విజేతలు.. అయితేనేం.. రషీద్ సేన ఓడించింది..!
నిన్న జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
By - Medi Samrat |
నిన్న జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు 38 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టీ20 ప్రపంచకప్ 2026కి ముందు రషీద్ ఖాన్ సారథ్యంలోని ఆఫ్ఘన్ జట్టు ఆల్ రౌండ్ ఆటను కనబరిచిన తీరు.. రాబోయే టోర్నీలో తమ జట్టును తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేసింది.
తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున ఇబ్రహీం జద్రాన్ అజేయంగా 87, డార్విష్ రసూలీ 84 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరే కాకుండా స్పిన్నర్లు రాణించడంతో ఆఫ్ఘన్ జట్టు తొలి టీ20లో వెస్టిండీస్‌ను 38 పరుగుల తేడాతో ఓడించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే వారి నిర్ణయం సరైనదని కాదని తొలుత అనిపించింది. అఫ్ఘాన్ జట్టు తొలి బంతికే స్టార్ బ్యాట్స్‌మెన్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వికెట్ 19 పరుగుల వద్ద పడింది. దీని కారణంగా ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. రెండు వికెట్ల పతనం తర్వాత ఆఫ్ఘన్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీల మధ్య మూడో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేయడమే కాకుండా.. బౌలర్లు లైన్-లెంగ్త్‌తో కరీబియన్ అటాక్‌పై దాడి చేశారు. దీంతో సులువుగా విజయం వరించింది.
ఇబ్రహీం జద్రాన్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 87 పరుగులు చేయగా, దర్విష్ రసూలీ 59 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో 53 పరుగులు చేసి స్కోరును 181/3కి తీసుకువెళ్లింది. దుబాయ్ పిచ్‌పై 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం సవాలుతో కూడుకున్నదే.. కానీ అసాధ్యం కాదు.
అయితే.. వెస్టిండీస్ ఆరంభం కూడా గొప్పగా ఏమీ లేదు. తొలి ఓవర్‌లోనే కెప్టెన్ బ్రాండన్ కింగ్ (4)ను బౌల్డ్ చేసి ముజీబ్ ఉర్ రెహ్మాన్ విండీస్ జట్టుకు గట్టి షాకిచ్చాడు. ఎవిన్ లూయిస్ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. జియావుర్ రెహ్మాన్ షరీఫీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జాన్సన్ చార్లెస్ (27) కొన్ని మంచి షాట్లు కొట్టాడు, కానీ ముజీబ్ అతనిని ఎల్‌బిడబ్ల్యు చేశాడు. తద్వారా వెస్టిండీస్ ఆశలను వమ్ము చేశాడు. దీని తర్వాత రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ల స్పిన్ తన మ్యాజిక్ పనిచేసింది. వెస్టిండీస్ తరఫున 4 బ్యాట్స్‌మెన్ మాత్రమే 25-30 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ 3 వికెట్లు తీయగా, ముజ్బీ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు.