మళ్లీ బ్యాట్ పట్టనున్న యువరాజ్.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే..?
భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు
By Medi Samrat Published on 1 Feb 2025 2:49 PM ISTభారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు. సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో పాల్గొననున్నాడు. యువరాజ్ ఇండియా మాస్టర్స్ జట్టుకు ఆడనున్నాడు. ఈ లీగ్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు జరగనుంది.
2007లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదాడు. అప్పటి నుండి అతని పేరు సిక్సర్ కింగ్‌గా మారింది. ఆ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడంలోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.
యువరాజ్ సింగ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ జేపీ డుమినీ కూడా ఈ లీగ్‌లో పాల్గొననున్నాడు. అతను మాస్టర్స్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇది తనకు గర్వకారణమని డుమిని అన్నాడు. డుమిని దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అదేవిధంగా, శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ ఉపుల్ తరంగ కూడా శ్రీలంక మాస్టర్స్ కోసం ఈ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ లీగ్‌లో ఆడటం పట్ల తరంగ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ లీగ్‌లో చేరిన సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ.. "సచిన్ టెండూల్కర్, నా ఇతర సహచరులతో కలిసి ఈ లీగ్‌లో ఆడటం నా పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. వారందరితో ఆడటం చాలా జ్ఞాపకాలను తిరిగి తెస్తుందన్నాడు.
మాస్టర్ లీగ్ దేశంలోని మూడు నగరాల్లో జరుగనుంది. ఈ లీగ్ మ్యాచ్‌లు నవీ ముంబై, రాజ్‌కోట్, రాయ్‌పూర్‌లలో జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. ఇండియా మాస్టర్స్ జట్టులో సచిన్ టెండూల్కర్ కూడా ఆడనున్నాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ కూడా ఈ లీగ్‌లో పాల్గొంటారు.