కులాన్ని కించపరిచేలా యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు.. అరెస్టు చేసిన పోలీసులు

Yuvraj Singh Arrested, Released On Bail. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో

By Medi Samrat  Published on  18 Oct 2021 5:36 AM GMT
కులాన్ని కించపరిచేలా యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు.. అరెస్టు చేసిన పోలీసులు

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేయాల్సి వచ్చింది. కుల వివ‌క్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో హ‌ర్యానాలోని హిసార్ జిల్లా హ‌న్సి పోలీసులు యువ‌రాజ్‌ను అరెస్టు చేశారు. అయితే వెంట‌నే బెయిల్ రావ‌డంతో యువరాజ్ బ‌య‌ట‌కు రావడం జరిగింది. గ‌త ఏడాది రోహిత్ శ‌ర్మతో క‌లిసి యువ‌రాజ్ సింగ్ ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లో మాట్లాడారు. ఆ సంద‌ర్భంగా యుజేంద్ర చాహ‌ల్‌పై యువరాజ్ వివాదాస్పద కామెంట్లు చేశారు. చాహ‌ల్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీడియోలు చేస్తున్నారని.. బాంగీ మ‌నుషుల్లా వీళ్ల‌కు ప‌ని పాటా లేదా అంటూ వ్యాఖ్యానించారు. ద‌ళితుల‌ను అవ‌మానించేలా యువ‌రాజ్ మాట‌లు ఉన్నాయ‌ని నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శలు వ‌చ్చాయి. యువ‌రాజ్ సింగ్ క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్లు కూడా వ‌చ్చాయి.

ఈ క్రమంలోనే హ‌ర్యానాలోని హిస్సార్ పోలీస్ స్టేష‌న్‌లో యువ‌రాజ్ సింగ్‌పై కేసు న‌మోదైంది. హ‌ర్యానా ద‌ళిత హ‌క్కుల నేత ర‌జ‌త్ క‌ల్సన్ ఫిర్యాదు మేర‌కు ఈ కేసు న‌మోదైంది. ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీలోని 153, 153ఎ, 295, 505, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 3 (1), (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు నమోదు చేశారు. యువరాజ్‌ ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అతనికి వెంటనే బెయిల్ లభించింది. విచారణను ఎదుర్కొన్న తరువాత యువరాజ్ సింగ్ విడుదల అయ్యాడు. తన స్నేహితులతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని.. ఉద్దేశపూరకంగా చేసినవి కావని స్పష్టం చేశాడు. ఒకరిని కించ పరచాలనేది తన ఉద్దేశం కాదని.. ఆ వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. గతంలో కూడా యువరాజ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పుకొచ్చాడు.


Next Story