చిన్నోడిని ఏమీ అనకండి.. ఇదే కదా రోహిత్ అంటే
Young Fan Invades Pitch And Hugs Rohit Sharma.ఓ బాలుడు సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి
By తోట వంశీ కుమార్
రాయ్‌పూర్ వేదికగా శనివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ బాలుడు సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. వేగంగా పరిగెత్తి క్రీజులో ఉన్న భారత కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు. ఊహించని ఈ పరిణామంతో అందరూ విస్తుపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాలుడిని రోహిత్ శర్మ నుంచి వేరు చేశారు.
ఈ సమయంలో రోహిత్ పడిపోయేవాడే కానీ బ్యాలెన్స్ చేసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది బాలుడిని ఏమన్నా అంటారేమోనని బావించిన రోహిత్ శర్మ.. అతడిని ఏమీ అనవద్దని సెక్యూరిటీ సిబ్బందికి సూచించాడు. ఈ ఘటనతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ మంచి మనస్సుకు ఇదే నిదర్శనం అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Rohit Sharma told the security - "let him go, he's a kid".
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2023
Great gesture by the captain! pic.twitter.com/7Gz6nDHsV3
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సునాయసనంగా చేధించింది. రోహిత్ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (40; 53 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో లక్ష్య చేధనలో భారత్ ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.