రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ గత కొంత కాలంగా నిరసన తెలుపుతున్న భారత దేశ టాప్ రెజ్లర్లు తమ ఆందోళనలను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఒలంపిక్స్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలను సాధించిన రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని.. అది జరగకుంటే తమ పతకాలను హరిద్వార్‌లోని గంగా నదిలో విసిరేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వారికి లభించిన పతకాలన్నీంటినీ గంగానదిలో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ నుంచి రెజ్లర్స్‌ను బలవంతంగా పోలీసులు తొలగించిన తర్వాత తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరమైన హరిద్వార్‌లో గంగలో తమ పతకాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నారు. రెజ్లర్లు ఇప్పటికే హరిద్వార్‌కు బయలుదేరారు. తమ ఆందోళనను ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తాము సాధించిన పతకాలను హరిద్వార్ లో గంగానదిలో కలిపేయనున్నామని ఒక ప్రకటన విడుదల చేశారు.