భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిప్టింగ్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన మరుసటి రోజే.. ప్రియా మాలిక్ ప్రపంచ స్థాయి టైటిల్ నెగ్గడం నిజంగా భారత క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తే విషయం. ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వరుసగా ఇలా ప్రపంచ వేదికలపై భారత అథ్లెట్లు సత్తా చాటడం శుభపరిణామం. ఇదిలావుంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత రెజ్లర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా.. పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు. వీరంతా పతక వేటలో సఫలమవ్వాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.