'నాకు వయసు పెరిగింది.. ఫాస్ట్ బౌలింగ్ ఆడలేను'.. రీఎంట్రీపై మాజీ డాషింగ్ ఓపెనర్
భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్న రోజుల్లో బౌలర్లపై భీభత్సంగా విరుచుకుపడేవాడు.
By Medi Samrat Published on 7 Feb 2025 3:24 PM IST
భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్న రోజుల్లో బౌలర్లపై భీభత్సంగా విరుచుకుపడేవాడు. ఫీల్డ్‌లో బంతి కనిపిస్తే షాట్ ఆడాలనేది సెహ్వాగ్ ఫార్ములా. తొలి బంతికే బౌండరీలు కొట్టడం వీరూకు అలవాటు. 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో ముఖ్యమైన సభ్యుడు అయిన వీరూ.. టోర్నమెంట్‌లో చాలా మ్యాచ్‌లలో మొదటి బంతికి ఫోర్ కొట్టాడు. డేల్ స్టెయిన్, జేమ్స్ అండర్సన్, ఉమర్ గుల్ వంటి బౌలర్లపై తను విరుచుకుపడేవాడు. వీరూ అక్టోబర్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అయితే.. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తన చేతులు-కళ్లకు మధ్య సమన్వయం ఇక సరిపోదని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. ఐఎల్‌టి 20లో కామెంటరీ ప్యానెల్‌లో భాగమైన సెహ్వాగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇకపై ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడటం ఎప్పుడూ చూడలేరని చెప్పాడు. "ఇటీవల ఏ భారతీయ ఆటగాడైనా అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యాడో అతను ఆడాలనుకుంటే, ఈ టోర్నమెంట్ వారికి మంచి వేదిక. “దినేష్ కార్తీక్ SA20 ఆడటానికి దక్షిణాఫ్రికాకు వెళ్లినట్లు.. ILT20లో కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఆడటం మంచిది. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ ఆడితే బాగుంటుంది. అతడు సిక్సర్ల రారాజు.. కానీ నేను ఆడలేను.. నాకు ఇప్పుడు వయసొచ్చింది. ఇకపై ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోలేను అని పేర్కొన్నాడు.
వివిధ టీ20 లీగ్‌లను గురించి ప్రస్తావిస్తూ.. ఏ క్రమంలో ఉంచాలనుకుంటున్నారని వీరేంద్ర సెహ్వాగ్‌ను అడిగారు. ఏ ఫ్రాంచైజీ లీగ్‌ని పోల్చడం తనకు ఇష్టం లేదని, ఎందుకంటే అన్ని లీగ్‌లకు వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయని.. అభిమానులలో ఉత్సాహం విపరీతంగా ఉందని చెప్పాడు. “నేను ఒక లీగ్‌ని మరొక లీగ్‌తో పోల్చలేను ఎందుకంటే వివిధ దేశాలలో లీగ్‌లు ఉన్నాయి. ఇది దేశాలకు మంచిది. ఐపీఎల్ భారత్‌కు మేలు చేస్తుంది. బిగ్ బాష్ లీగ్ ఆస్ట్రేలియాకు మంచిది. అదేవిధంగా ILT20 UAEకి మంచిది. కాబట్టి ఒకదాన్ని ఎంచుకోవడం కష్టం. కానీ ILT20 గురించిన మంచి విషయం ఏమిటంటే.. మీరు ఒకే జట్టులో 9 మంది అంతర్జాతీయ ఆటగాళ్ళు ఆడటం చూడవచ్చు. ఇది ఈ లీగ్‌లోనే సాధ్యం అని పేర్కొన్నాడు.