ఇక ఆస్ట్రేలియా ఆశలన్నీ శ్రీలంక మీదనే

Worn SCG wicket could aid Australia’s semi-final hopes. టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించింది. పోరాడిన ఆఫ్ఘనిస్థాన్ పై 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

By Medi Samrat  Published on  4 Nov 2022 12:35 PM GMT
ఇక ఆస్ట్రేలియా ఆశలన్నీ శ్రీలంక మీదనే

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్థాన్ ను ఓడించింది. పోరాడిన ఆఫ్ఘనిస్థాన్ పై 4 పరుగుల తేడాతో గెలిచింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్లో ఆఫ్ఘన్ విజయానికి 6 బంతుల్లో 22 పరుగులు అవసరం కాగా, రషీద్ ఖాన్ ఆఖరి బంతి వరకూ పోరాడాడు. చివరికి ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 23 బంతుల్లోనే 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రషీద్ స్కోరులో 3 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 30, గుల్బదిన్ నాయబ్ 39, ఇబ్రహీం జాద్రాన్ 26 పరుగులు చేశారు. ఉస్మాన్ ఘనీ (2), కెప్టెన్ మహ్మద్ నబీ (1) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2, కేన్ రిచర్డ్సన్ 1 వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో గ్లెన్ మ్యాక్స్ వెల్ 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. మిచెల్ మార్ష్ 45, వార్నర్ 25, స్టొయినిస్ 25 పరుగులు చేశారు. తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మాథ్యూ వేడ్ 6 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన కామెరాన్ గ్రీన్ (3), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (4) విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో నవీనుల్ హక్ 3, ఫజల్ హక్ ఫరూకీ 2, ముజీబ్ ఉర్ రెహమాన్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గినప్పటికీ సెమీస్ కు వెళ్లే అవకాశం మాత్రం కనిపించలేదు. భారీ తేడాతో నెగ్గి రన్ రేట్ పెంచుకోవాలని భావించినా, ఆఫ్ఘన్ జట్టు పోరాడడంతో రన్ రేట్ ఇంకా మైనస్ లోనే ఉంది. పాయింట్ల పరంగా ఇప్పుడు ఆసీస్ గ్రూప్-1లో రెండోస్థానానికి చేరింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ రన్ రేట్ -0.173 కాగా, ఆసీస్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ( 0.547) రన్ రేట్ అంతకంటే మెరుగ్గా ఉంది. రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే ఆసీస్ సెమీస్ చాన్సులు గల్లంతవుతాయి. అందుకే ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆశలన్నీ శ్రీలంక మీదనే ఉన్నాయి.


Next Story
Share it