అనుకున్నట్లుగానే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ వేదిక మార్పు
World Test Championship Final To Be Played In Southampton. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్
By Medi Samrat Published on 8 March 2021 8:45 PM ISTభారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదికను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా తేలింది. లార్డ్స్ లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ను నిర్వహించాలని ఐసీసీ భావించినప్పటికీ అది వీలుపడలేదు. దీంతో ఈ మ్యాచ్ సౌథాంప్టన్‌లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.
ఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ గంగూలీ మాత్రం సౌథాంప్టన్ లో అని కూడా తేల్చేశారు. లండన్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలని అనుకుంటున్నా అని ఇండియా టుడేతో గంగూలీ చెప్పాడు. ఈ ఫైనల్ వన్డే వరల్డ్‌కప్‌కు ఉన్నంత విలువ ఉంటుందా అని ప్రశ్నించగా.. ప్రతి ట్రోఫీకి దానికి ఉండాల్సిన విలువ ఉంటుంది. వన్డే వరల్డ్‌కప్ అద్భుతమైనది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి డబ్ల్యూటీసీ క్లిష్టంగా మారింది. ప్రతి టీమ్ సమానమైన మ్యాచ్‌లు ఆడినప్పుడు చూడండి అని గంగూలీ అన్నారు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా 72.2 విజయశాతంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. జూన్ 18వ తేదీన లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలబడనుందని ప్రచారం జరగ్గా.. ఇప్పుడు ఈ మ్యాచ్ సౌథాంప్టన్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.