రాణించిన బౌలర్లు.. భారత్ సెమీస్ ఆశలు సజీవం
Women's World Cup 2022 India beat Bangladesh by 110 runs.బౌలర్లు రాణించడంతో కీలక మ్యాచ్‌లో భారత్ ఘన
By తోట వంశీ కుమార్ Published on 22 March 2022 2:10 PM ISTబౌలర్లు రాణించడంతో కీలక మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. మహిళల ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా మంగళవారం హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 110 పరుగుల భారీ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చివరి మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధిస్తే ఎలాంటి ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. మార్చి 27న టీమ్ఇండియా తన ఆఖరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఏ దశలోనూ బంగ్లా విజయం దిశగా సాగలేదు. బంగ్లా బ్యాటర్లలో సల్మా(32), లతా మోందల్(24) మాత్రమే ఓ మోస్తారుగా రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు, పూజ వస్త్రాకర్, ఝులన్ గోస్వామి చెరో రెండు వికెట్లు, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
A magnificent win for #TeamIndia 🙌
— ICC (@ICC) March 22, 2022
They beat Bangladesh by 110 runs to keep their semi-finals qualification hopes alive. #CWC22 pic.twitter.com/ix3xmjE41q
అంతముందు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యస్తిక బాటియా(50) అర్థశతకంతో రాణించగా..షెఫాలీ వర్మ(42), స్మృతి మంధాన 30, పూజా వస్త్రాకర్(30 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ మిథాలీ రాజ్ డకౌట్ కాగా.. హర్మన్ కౌర్ (14) విఫలం అయ్యారు. మిగిలిన వారిలో రిచా ఘోష్ 26, స్నేహ్ రాణా 27 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు పడగొట్టగా.. నహిదా రెండు, జహనర ఓ వికెట్ తీసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఈ దశలో బంగ్లా బౌలర్లు విజృంబించడంతో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరితో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ వికెట్లను భారత్ కోల్పోయింది. దీంతో 74 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ యస్తిక బాటియా ఒంటరి పోరాటం చేయగా.. ఆఖర్లో ఆల్‌రౌండర్లు రాణించడంతో భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది.