మహిళల టీ20 ప్రపంచకప్.. నేడు భారత్‌తో పాక్ పోరు
Women's T20 World Cup Match between India and Pakistan today.భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2023 9:31 AM GMTఆట ఏదైనా కానివ్వండి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ఇక క్రికెట్‌లో అది కూడా ప్రపంచకప్‌లో టీమ్ఇండియా, పాకిస్తాన్ లు తలపడుతున్నాయంటే ప్రేక్షకుల అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దక్షిణాఫ్రికా వేదికపై జరగుతున్న టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేడు భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియానే ఫేవరెట్ అనడంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాం లేదు. అయితే.. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం టీమ్ఇండియాకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
దీంతో బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ, జెమీమాలనే పడింది. టీమ్ఇండియాకు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన షెఫాలీ పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఓపెనర్‌గా షెఫాలీ రాణిస్తే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఇక వార్మప్ మ్యాచ్‌లో రిచా ఘోష్, జెమీమా చెలరేగి ఆడారు. వీరిద్దరు అదే ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది.
బ్యాటింగ్ సంగతి ఎలా ఉన్నా సరే బౌలింగ్ విభాగం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క పేసర్ రేణుక సింగ్ మాత్రమే ఆకట్టుకుంటోంది. మిగిలిన వారు దారాళంగా పరుగులు ఇస్తున్నారు. నిలకడగా వికెట్లు తీయడంలో విఫలం అవుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ శిఖా పాండేతో పాటు తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి, పూజా వస్త్రాకర్ లు ఎలా బౌలింగ్ చేస్తారు అన్నదానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
భారత జట్టు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే షాక్ తప్పదు.