మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల‌

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

By Medi Samrat
Published on : 1 May 2025 3:01 PM IST

మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల‌

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. జూలై 5న ఫైనల్‌కు లార్డ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. బర్మింగ్‌హామ్, సౌతాంప్టన్, లీడ్స్, మాంచెస్టర్, కెన్నింగ్టన్ ఓవల్, బ్రిస్టల్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 1న లార్డ్స్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్ సందర్భంగా వేదిక, తేదీని ప్రకటించారు.

టోర్నీలో 33 మ్యాచ్‌లు 24 రోజుల్లో జరగనున్నాయి. త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. మహిళల క్రికెట్‌లో ప్ర‌తి టోర్నీలో గరిష్ట సంఖ్యలో జట్లు పాల్గొంటాయి. కాగా, 2017 మహిళల ODI ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా లార్డ్స్ ఆతిథ్యమిచ్చింది.

ఇంగ్లండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఎనిమిది జట్లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ స్థానాలను ఖాయం చేసుకోగా.. మిగతా నాలుగు జట్లను వచ్చే ఏడాది క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేస్తారు.

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ టోర్నమెంట్‌లో నాకౌట్ ద‌శ‌, ఫైనల్ ఉంటుంది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.

Next Story