నేటి నుంచే మహిళల ఐపీఎల్.. తొలి మ్యాచ్ గుజరాత్ vs ముంబై
మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నేడు తెరలేవనుంది.డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో గుజరాత్, ముంబై తలపడనున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 2:47 PM ISTనేటి నుంచే మహిళల ఐపీఎల్
ఎన్నాళ్లుగానో వేచిన రోజు రానే వచ్చింది. మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నేడు(శనివారం) తెరలేవనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చొరవతో అన్ని అడ్డంకులు దాటుకుని మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆరంభ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 5 జట్లు 22 మ్యాచులతో 23 రోజుల పాటు సాగే ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. 87 మంది క్రికెటర్లలలో అభిమానుల మనసులను ఎంత మంది గెలుచుకుంటారో చూడాలి.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ సమరానికి సై అంటున్నాయి. ఈ నెల 26న జరిగే ఫైనల్ పోరులో విజేతగా నిలిచి తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్ స్టేడియాలు ఈ సీజన్‌లోని మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. స్పోర్ట్స్-18 నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అంతేకాదు జియో సినిమా యాప్‌లోనూ మ్యాచ్‌లను చూడొచ్చు.
నేటి ఆరంభ మ్యాచ్‌లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ముంబై జట్టులో హర్మన్‌తో పాటు యస్తికా భాటియా, పూజ లాంటి భారత ప్లేయర్లతో పాటు అమేలీ కెర్, హీలీ మాథ్యూస్, నటాలియా స్కీవర్, హీథర్ గ్రహమ్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ గుజరాత్ కు నాయకత్వం వహిస్తోంది. ఆమెతో పాటు స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్ కీలకం కానున్నారు. గుజరాత్ జట్టులో సబ్బినేని మేఘన, షబ్నమ్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు.