12 ప్రపంచకప్‌లు జరిగితే 7 సార్లు ఆ జట్టే టైటిల్ నెగ్గింది..!
మహిళల ODI ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
By - Medi Samrat |
మహిళల ODI ప్రపంచ కప్ 2025 టైటిల్ మ్యాచ్ ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఇరు జట్లు తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించనున్నాయి. అయితే.. వన్డే ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్ల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం.
మహిళల వన్డే ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 1973లో ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం 12 ప్రపంచకప్‌లు జరగ్గా.. ఇందులో ఆస్ట్రేలియా ఏడుసార్లు టైటిల్‌ను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇంగ్లండ్ జట్టు నాలుగుసార్లు ట్రోఫీని గెలుచుకుని రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ ఒకసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. నేడు మహిళా క్రికెట్‌లో కొత్త ప్రపంచ ఛాంపియన్ అవతరించచబోతోంది. భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. ఇద్దరూ తమ తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో మూడోసారి ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. 2005లో ఆస్ట్రేలియా, 2017లో ఇంగ్లండ్‌తో పైనల్ మ్యాచ్‌లలో భారత్ ఓడింది. మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు లేని తొలి ఫైనల్ ఇదే. ప్రపంచకప్‌లో భారత్ తన మూడో ఫైనల్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇరుదేశాల మధ్య 34 వన్డేల్లో 20 విజయాలతో భారత్‌ది పైచేయి ఉంది.. కానీ ప్రపంచకప్‌లో పోటీ సమానంగా ఉంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది, అయితే గత మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా భారత్‌ను ఓడించింది.