Video : ఏడు నెలల తర్వాత ఎంట్రీ ఇచ్చి 5 వికెట్లతో అద‌ర‌గొట్టిన అర్జున్ టెండూల్కర్

గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఏడు నెలల తర్వాత మైదానంలోకి పునరాగమనం చేశాడు.

By -  Medi Samrat
Published on : 12 Sept 2025 12:57 PM IST

Video : ఏడు నెలల తర్వాత ఎంట్రీ ఇచ్చి 5 వికెట్లతో అద‌ర‌గొట్టిన అర్జున్ టెండూల్కర్

గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఏడు నెలల తర్వాత మైదానంలోకి పునరాగమనం చేశాడు. అయితే.. అర్జున్‌ తొలి బంతికే వికెట్ తీసి బ‌ల‌మైన పునరాగమనం చేశాడు. అంతేకాదు ఇన్నింగ్స్ లో మొత్తం ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోన‌ 36 పరుగులు చేసి ఉపయోగకరమైన సహకారం అందించాడు.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) నిర్వహిస్తున్న డాక్టర్ (కెప్టెన్) కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో అర్జున్ టెండూల్కర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ మహారాష్ట్రపై అద్భుత ప్రదర్శన చేశాడు.


అర్జున్ టెండూల్కర్ తన పదునైన బౌలింగ్ తో మహారాష్ట్ర వెన్ను విరిచాడు. అర్జున్ ధాటికి మహారాష్ట్ర జట్టు 136 పరుగులకే కుప్పకూలింది. గోవా తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. అర్జున్ టెండూల్కర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 44 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అయితే గోవా తరఫున అభినవ్ తేజ్రానా (77), దర్శన్ మిసాల్ (61), మోహిత్ రెడ్కర్ (58) అర్ధ సెంచరీ ఇన్నింగ్సులు ఆడారు.

అర్జున్ టెండూల్కర్ గతంలో దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అతడు మహారాష్ట్ర జట్టు తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2022లో గోవా జ‌ట్టులో చేరాడు. ఇటీవలే అర్జున్ టెండూల్కర్‌కి సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏడు నెలల తర్వాత అర్జున్ క్రికెట్ యాక్షన్‌లోకి తిరిగి వచ్చాడు.

Next Story