రూ. 27 కోట్లకు అమ్ముడైనప్పటికీ.. పంత్ పూర్తి జీతాన్ని పొందలేడు..!
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 5:13 AM GMTసౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు చెల్లించి అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది. ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 15-20 నిమిషాలకు ముందు పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్ రికార్డును పంత్ అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అమ్ముడైన పంత్.. ఏటా రూ.27 కోట్లను అందుకోలేడు.. అతనికి సంవత్సరానికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకుందాం.
IPL 2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.. అయితే ఇంత ఖరీదైన ధరకు విక్రయించబడినప్పటికీ పంత్‌కు పూర్తి మొత్తం లభించదు. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి.. ప్రతి సంవత్సరం రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉన్న వ్యక్తి దానిలో 30% పన్నుగా చెల్లించాలి. అందువల్ల పంత్ జీతం రూ. 27 కోట్లలో 30% పన్నుగా పోతుంది. దీంతో రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తన మూడేళ్ల పదవీకాలంలో ప్రతి సీజన్‌కు రూ. 18.9 కోట్ల వేతనం పొందనున్నాడు.
కాంట్రాక్ట్ విలువ- రూ. 27 కోట్లు (సీజన్‌కు)
పన్ను మినహాయింపు – రూ. 8.1 కోట్లు (భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం)
నికర జీతం – రూ. 18.9 కోట్లు (సీజన్‌కు)
ఐపీఎల్ 2025 వేలానికి ముందు రిషబ్ పంత్‌ను వేలంలోకి ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీని తరువాత పంత్ రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ మొదట వేలం వేసింది. ఆ తర్వాత RCB కూడా వేలంలో పాల్గొంది. RCB మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పంత్ కోసం యుద్ధం 11.25 కోట్ల వరకు కొనసాగింది. ఆ తర్వాత పంత్‌పై రూ.12 కోట్లకు తొలి బిడ్ వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలోకి ప్రవేశించింది. SRH, LSG మధ్య చాలా సేపు వేలం యుద్ధం జరిగింది. చివరకు లక్నో పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ RTM ద్వారా రూ. 20.755 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేయాలని భావించింది.. లక్నో మాత్రం రూ. 27 కోట్లకు బిడ్ వేసి గెలిచింది.