క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. ఎందుకంటే.?

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండవ టీ20 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది.

By Medi Samrat  Published on  13 Dec 2023 4:54 PM IST
క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. ఎందుకంటే.?

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండవ టీ20 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్ వృథాగా పోగా.. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు 152 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే ఛేదించారు. రింకూ సింగ్‌ (68 నాటౌట్), సూర్యకుమార్‌ యాదవ్‌ (56) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. కోయెట్జీ 3 కీలకమైన వికెట్లు, మార్కో యెన్సెన్, విలియమ్స్, షంసీ, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ బాదిన సిక్సర్‌ కారణంగా మీడియా గ్లాస్‌ బాక్స్‌ బద్దలైంది. పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్‌ హిట్‌ కారణంగా గ్లాస్ బాక్స్ బద్దలవ్వడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం స్పందించిన రింకూ సింగ్‌.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పారు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో.. ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించానని.. నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా అని రింకూ సింగ్‌ తెలిపాడు.

Next Story