అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెట‌ర్ త‌మ్ముడు..!

యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అత‌డు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు

By Medi Samrat  Published on  6 Sept 2024 3:01 PM IST
అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న టీమిండియా క్రికెట‌ర్ త‌మ్ముడు..!

యువ బ్యాట్స్‌మెన్ ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అత‌డు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముషీర్ భారత్-ఏ పై అదిరిపోయే ఇన్నింగ్సు ఆడాడు. అయితే అతడు తృటిలో డబుల్ సెంచరీని సాధించలేకపోయాడు. ముషీర్‌కి ఇది దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌. అతని మొదటి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించాడు.

ముషీర్ ఈ ఏడాది ఆరంభంలో భారత జట్టు తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ కూడా ఇండియా-బి తరఫున ఆడుతున్నాడు. అయితే అత‌డు తొమ్మిది పరుగులకే ఔటయ్యాడు. ముషీర్ మ్యాచ్ తొలి రోజునే సెంచరీ సాధించాడు. అయితే రెండో రోజు రెండో సెషన్‌లో అతడు ఔట్ అయ్యాడు.

ముషీర్ 105 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్సు ప్రారంభించాడు. రెండో రోజు ముషీర్ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి నవదీప్ సైనీ మద్దతు లభించింది. ముషీర్ తొలి సెషన్‌ను 174 పరుగులతో ముగించాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో డబుల్ సెంచరీ పూర్తి చేయాలని భావించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో డీప్ మిడ్ వికెట్ వద్ద రియాన్‌ పరాగ్ చేతికి చిక్కాడు.

సైనీ, ముషీర్ మధ్య 205 పరుగుల భాగస్వామ్యం న‌మోదైంది. భారత్-బి 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సమయంలో ఈ భాగస్వామ్యం ఏర్పడింది. ముషీర్ 373 బంతులు ఎదుర్కొని 181 పరుగులు చేశాడు. ముషీర్ అవుటైన తర్వాత సైనీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్ద‌రి భాగస్వామ్యంతో ఇండియా-బి 321 ప‌రుగుల‌ బలమైన స్కోరు సాధించింది.

Next Story