నేడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. ఎప్పుడు టెలీకాస్ట్ అవుతుందంటే?
ఆట ఏదైనా భారత్-పాక్ తలపడ్డాయంటే ఆ మజానే వేరు. నేడు కూడా అలాంటి ఆసక్తి పోరు అభిమానులను అలరించనుంది.
By Medi Samrat Published on 9 Aug 2023 3:35 PM ISTఆట ఏదైనా భారత్-పాక్ తలపడ్డాయంటే ఆ మజానే వేరు. నేడు కూడా అలాంటి ఆసక్తి పోరు అభిమానులను అలరించనుంది. హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 భారతదేశంలో జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో బుధవారం, ఆగస్టు 9వ తేదీన హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 8:30 నుండి మొదలుకానుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు గ్రేట్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ టోర్నమెంట్ లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తూ ఉంది. దక్షిణ కొరియాపై భారతదేశం అద్భుతమైన విజయం సాధించడంతో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆత్మవిశ్వాసాన్ని మరింత పెరగాలంటే భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించాల్సి ఉంటుంది. జైత్ర యాత్రను భారత్ కొనసాగించాలని చూస్తూ ఉంది. పాయింట్స్ టేబుల్ లో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. కానీ సెమీఫైనల్ బెర్త్‌పై ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. జపాన్ జట్టు సాధించే ఫలితం బట్టి పాక్ సెమీస్ ఎంట్రీ ఉంటుంది. ముఖ్యంగా భారత్ ను ఓడించాల్సి ఉంటుంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత్ పాక్ కు అడ్డుగా నిలిచింది. హాకీ క్రీడలో భారత్, పాకిస్థాన్‌లు 178 సార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 82, భారత జట్టు 64 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అదే సమయంలో 32 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈరోజు భారత్ మీద గెలవడం పాక్ కు చాలా ముఖ్యం.