వర్షం పడి సెమీఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ఫైనల్‌కు టీమ్ఇండియా
What will happen if the semifinal between India vs England gets washed out due to rain.టీ20 ప్రపంచకప్ టోర్నీ
By తోట వంశీ కుమార్ Published on 8 Nov 2022 9:56 AM GMTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ సూపర్ 12 దశ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి సెమీ ఫైనల్ మ్యాచులపైనే ఉన్నాయి. నవంబర్ 9న బుధవారం జరిగే తొలి సెమీస్‌లో పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడనుండగా నవంబర్ 10న గురువారం రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ తో టీమ్ఇండియా ఢీ కొట్టనుంది. ఈ మ్యాచుల్లో విజయం సాధించిన జట్లు నవంబర్ 13న ఫైనల్‌లో తలపడనున్నాయి.
ఇక ప్రపంచకప్ ఆరంభం నుంచి మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా కొన్ని మ్యాచులు పూర్తిగా రద్దు కాగా.. మరికొన్ని మ్యాచుల్లో ఓవర్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సెమీ ఫైనల్ మ్యాచులు అయినా సజావుగా జరుగుతాయా లేదా అన్నదానిపైనే ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచులకు ఎలాంటి వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ చెప్పింది. ఒకవేళ వర్షం పడి మ్యాచులు జరగకపోతే ఏం జరుగుతుంది..? ఎవరిని విజేతగా ప్రకటిస్తారు అన్న ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతున్నాయి.
దీనికి సమాధానం ఏంటంటే.. ఐసీసీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచులకు రిజర్వ్ డే అందుబాటులో ఉంది. ఒక వేళ వర్షం అంతరాయం కలిగించి ఆట సాధ్యం కాకపోతే.. మ్యాచ్ ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడి నుంచే మరుసటి రోజు ఆట ప్రారంభం అవుతుంది. రిజర్వ్ డేలో కూడా ఆట సాధ్యం కాకుంటే గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అంటే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో భారత జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఇక ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం పడి రద్దు అయితే.. ఇరు జట్లను సంయుక్తంగా విజేతగా ప్రకటిస్తారు.