త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌.. సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన విండీస్‌

మంగళవారం సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

By -  Medi Samrat
Published on : 22 Oct 2025 8:42 AM IST

త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌.. సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన విండీస్‌

మంగళవారం సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ త‌ర్వాత 50 ఓవర్లలో వెస్టిండీస్ కూడా అదే స్కోరు చేసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ జరగడంతో వెస్టిండీస్ విజయం సాధించింది.

సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఒక వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మూడో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. చివ‌రి మ్యాచ్‌లో గెలిచిన జట్టు వోసిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పిచ్ చర్చనీయాంశమైంది. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇలాంటి పిచ్‌లు క‌న‌ప‌డ‌వు. పిచ్‌పై భారీగా ప‌గుళ్లు ఉన్నాయి. దీంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం కష్టంగా మారింది.

పిచ్‌ను పరిశీలిస్తే, వెస్టిండీస్ 50 ఓవర్ల మొత్తాన్ని తన స్పిన్నర్లతో మాత్రమే బౌలింగ్ చేసింది. పూర్తిస్థాయి సభ్య జట్టు పూర్తి ఓవర్ల కోటా స్పిన్నర్లను రంగంలోకి దించడం అంతర్జాతీయ వేదికపై ఇదే తొలిసారి. దీంతో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోరు చేయలేకపోయారు.

జట్టు తరఫున సౌమ్య సర్కార్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 89 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మెహదీహాసన్ మిరాజ్ 58 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. నూరుల్‌హాసన్ కూడా 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు. చివర్లో, రషీద్ హుస్సేన్ 14 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 39 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌కు మద్దతుగా నిలిచి జట్టును ఆలౌట్ అవ‌కుండా కాపాడాడు.

ఆ త‌ర్వాత వెస్టిండీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. బ్రాండన్ కింగ్ తొలి ఓవర్ మూడో బంతికే పెవిలియన్ బాట పట్టాడు. అతను నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. అలైక్ అతనాజే, కె.సి.కార్తీ కాసేపు క్రీజులో నిల‌బ‌డ్డారు.స్కోరు 52 వద్ద అతనాజే 28 పరుగులు చేసి ఔటయ్యాడు. 82 ప‌రుగుల వ‌ద్ద‌ కార్తీని హుస్సేన్ అవుట్ చేశాడు. అతడు 35 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత షాయ్ హోప్ బాధ్యతలు స్వీకరించాడు, అయితే మరో ఎండ్ నుండి వికెట్లు పడుతున్నాయి. హోప్ కారణంగా మ్యాచ్ టై అయ్యింది. ఆపై మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లింది.. ఇందులో వెస్టిండీస్ గెలిచింది.

Next Story