బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్ రెండో పతకాన్ని సాధించింది. పురుషుల 61 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజా పూజారి పతకం సాధించాడు. శనివారం నాడు జరిగిన ఈవెంట్‌లో గురురాజా పూజారి 269 కేజీలు (118+151) ఎత్తి కాంస్యం సాధించి భారతదేశానికి రెండవ పతకాన్ని అందించాడు. గురురాజా కెనడాకు చెందిన యూరి సిమర్డ్‌తో పోటీ పడ్డాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 151కిలోల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసిన గురురాజా పూజారి 269కిలోలతో ముగించాడు, సిమర్డ్ కంటే ఒక కిలో ఎక్కువ బరువు ఎత్తి భారత్‌కు 2వ పతకాన్ని అందించాడు.
అంతకుముందు భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ పురుషుల 55 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 21 ఏళ్ల సంకేత్ పతకం సాధించడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతా తెరిచింది. మొత్తం 248 కిలోల (స్నాచ్‌లో 113 కిలోలు, క్లీన్ & జెర్క్‌లో 135 కిలోలు) ఎత్తి పతకం సాధించాడు. ఇరువురు విజేతలకు సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.