రెజర్లకు మద్దతుగా శనివారం హర్యానాలోని సోనిపట్‌లో మహాపంచాయత్ నిర్వహించారు.. ఈ సందర్భంగా రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయినప్పుడే ఆసియా క్రీడలు ఆడతామని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 15లోగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే తదుపరి వ్యూహం ప్రకటిస్తామని మహాపంచాయతీలో తీర్మానించారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలి.. బయట ఉంటే భయానక వాతావరణం నెలకొంటుంది.. ముందుగా అరెస్ట్ చేయండి.. తర్వాత దర్యాప్తు చేయండి.. మాకు మద్దతు లభిస్తోంది.. మేం సత్యయుద్ధం చేస్తున్నాం.. కొన్ని ఫేక్ న్యూస్‌లు నడుస్తున్నాయని సాక్షి మాలిక్ అన్నారు.
మహాపంచాయత్ ప్రారంభానికి ముందు మల్లయోధుడు బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంతో మేం జరిపిన చర్చలను మా మధ్యనే ఉంచుతాం.. ఏ సంస్థ అయినా.. మాకు మద్దతుగా నిలిచే వారి ముందు ఈ చర్చను ఉంచుతాం. ఖాప్ పంచాయితీలతో చర్చించిన తర్వాతే క్రీడాకారులు తదుపరి వ్యూహాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. జూన్ 7న కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం రెజ్లర్లు మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై జూన్ 15లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు చెప్పారు. ఆటగాళ్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఢిల్లీ పోలీసులు ఉపసంహరించుకుంటారు. జులై 15 వరకు ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని మల్లయోధులు తెలిపారు.