వేగం పెర‌గాలంటే డ్ర‌గ్స్ తీసుకోవాల‌న్నారు : అక్త‌ర్‌

Was told to use drugs to enhance my bowling speed. నిల‌క‌డ‌గా 150కి.మీ వేగంతో బంతులు వేయ‌డం పాకిస్థాన్ మాజీ పేస‌ర్

By Medi Samrat  Published on  25 Nov 2020 7:23 AM GMT
వేగం పెర‌గాలంటే డ్ర‌గ్స్ తీసుకోవాల‌న్నారు : అక్త‌ర్‌

నిల‌క‌డ‌గా 150కి.మీ వేగంతో బంతులు వేయ‌డం పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కే సొంతం. 2002లో న్యూజిలాండ్‌పై 161 కి.మీ వేగంతో బంతిని వేసి ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో అత్యంత వేగ‌వంత‌మైన బంతిని వేసిన బౌల‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. ఇక అభిమానులు అంతా ముద్దుగా రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలుచుకుంటారు. పాక్‌లోనే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా అక్త‌ర్‌కు అభిమానులు ఉన్నారు. అయితే.. బౌలింగ్‌లో వేగాన్ని పెంచుకునేందుకు డ్ర‌గ్స్ తీసుకోవాల‌ని అక్త‌ర్ కు కొంద‌రు సూచించార‌ట‌. అయితే.. తాను వాటి మాట‌ల‌ను సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని చెప్పుకొచ్చాడు ఈ పాక్ మాజీ పేస‌ర్‌.

పాకిస్తాన్‌లో యాంటీ నార్కోటిక్స్ సమావేశంలో పాల్గొన్న అక్తర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించాడు. తాను క్రికెట్ కెరిర్ ప్రారంభించిన రోజుల్లో బౌలింగ్‌లో వేగం పెంచుకోవాల‌ని అనుకున్నా. క‌నీసం గంట‌కు 100 కి.మీ వేగంతో బంతులు సంధించాల‌న్నా మాద‌క ద్రవ్యాలు తీసుకోవాల‌న్నారు. అయితే.. వాటిని తిర‌స్క‌రించా. వేగం కోసం తాను ఎంతో ప్రాక్టీస్ చేసేవాడినని అక్త‌ర్ తెలిపాడు. నిత్యం గ్రౌండ్‌లో శ్ర‌మించ‌డం వ‌ల్లే.. సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించగలిగానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లకు సైతం ఇలాంటి పరిస్థితులు వస్తాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించాడు. అయితే డ్రగ్స్ తీసుకోమన్న ఆటగాళ్ల పేర్లు మాత్రం అక్త‌ర్‌ బయటపెట్టలేదు.

అనంత‌రం ఈ స‌మావేశానికి సంబంధించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నాడు. మాద‌క ద్ర‌వ్యాలకు వ్య‌తిరేకంగా నిర్వ‌హించిన స‌మావేశానికి అతిథిగా వ‌చ్చినందుకు గౌరవంగా భావిస్తున్నా. పాకిస్థాన్‌ను మాద‌క ద్ర‌వ్యాల ర‌హిత దేశంగా మార్చ‌డానికి సంబంధిత శాఖ గొప్ప‌గా ప‌నిచేస్తుంది. మంచి భ‌విష్య‌త్తు కోసం ఆట‌లు ఆడ‌డండి, శారీర‌క క‌స‌ర‌త్తులు చేయండి అని ఫోటోల కింద రాసుకొచ్చాడు.

పాకిస్థాన్ త‌రుపున 46 టెస్టుల్లో 178, 163 వ‌న్డేల్లో 247, 15 టీ20ల్లో 19 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2010లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన అక్త‌ర్‌.. త‌న కెరీర్‌లో 444 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు.


Next Story