భారత్, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓ ప్లేయర్ ను పక్కన పెట్టేసింది. మ్యాచ్ మధ్యలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ మాట్ రేన్షా ని టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని హెల్మెట్‌కి రెండు సార్లు బంతి బలంగా తాకింది.. దీంతో కాంకషన్ ప్రొటోకాల్ ప్రకారం డేవిడ్ వార్నర్‌ని మ్యాచ్ నుంచి తప్పించి కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో మాట్ రేన్షాని తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీకి ఆస్ట్రేలియా తెలియజేసింది.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విసిరిన రెండు బంతులు డేవిడ్ వార్నర్ హెల్మెట్‌కి తాకాయి. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 15 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఫీల్డింగ్ కోసం మైదానంలోకి డేవిడ్ వార్నర్ రాలేదు. అతని స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో రేన్షా వచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో అతనే బ్యాటింగ్ చేయనున్నాడు.