వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా.. హైదరాబాద్ లో మ్యాచ్ లు జరిగేనా..!

Wankhede Groundstaff Test Covid Positive. ఈ ఏడాది భారత్ లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఎంతో పట్టుబట్టింది. అనుకున్నట్లుగానే

By Medi Samrat  Published on  3 April 2021 4:56 PM IST
వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా.. హైదరాబాద్ లో మ్యాచ్ లు జరిగేనా..!

ఈ ఏడాది భారత్ లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఎంతో పట్టుబట్టింది. అనుకున్నట్లుగానే కరోనా కేసులు తగ్గడంతో ఐపీఎల్ వేదికలను ఖరారు చేసి.. ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను తరలించాయి. అయితే గత 15రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఐపీఎల్ నిర్వహణ విషయంలో చాలా భయాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరికొందరు అన్ని రోజుల పాటూ బయో బబుల్ లో ఉండలేమని టోర్నమెంట్ కు దూరం అయ్యారు. తాజాగా వాంఖడే స్టేడియంలో సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమవుతోంది. ఇంతలో ముంబయి వాంఖడే స్టేడియం సిబ్బంది కరోనా బారినపడ్డారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు వస్తున్నది మహారాష్ట్రలోనే. అది కూడా ముంబయిలో.. ఇక వాంఖడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఐపీఎల్ పోటీల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించిన ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపించి వేసి, వారి స్థానంలో కొత్త సిబ్బందిని తీసుకున్నారు.

ఆటగాళ్లందరూ బయో బబుల్ లో ఉన్నారని, పైగా ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నందున టోర్నీని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతే హైదరాబాద్, ఇండోర్ నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని గతంలో పలువురు ప్రముఖులు, కేటీఆర్ కూడా కోరిన సంగతి తెలిసిందే..!


Next Story