ఎంజాయ్ చేయడానికే మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌కు వస్తాడు
Virender Sehwag Slams Glenn Maxwell Again. వీరేందర్ సెహ్వాగ్.. ఒకప్పుడు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు మెంటర్ గా కూడా పని
By Medi Samrat Published on 10 Dec 2020 1:33 PM IST
వీరేందర్ సెహ్వాగ్.. ఒకప్పుడు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు మెంటర్ గా కూడా పని చేశారు. అదే జట్టుకే మ్యాక్స్ వెల్ కూడా ఆడుతూ ఉన్నాడు. అయితే మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో ఒకలా.. ఆస్ట్రేలియా జట్టుకు మరోలా ఆడుతూ ఉన్నాడు. ఈ విషయంపై సెహ్వాగ్ స్పందించాడు. కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కు వస్తుంటాడని.. జట్టును గెలిపించాలని అతడు కోరుకోడని విమర్శలు గుప్పించాడు సెహ్వాగ్. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడాడు. డిసెంబర్ 2019లో జరిగిన ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కొన్నారు. ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లాడిన అతను 105 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్‌వెల్ ఆసీస్ టూర్‌లో మాత్రం మంచి ప్రదర్శన నమోదు చేశాడు. మూడు వన్డేలు కలిపి 167 పరుగులు, మూడు టీ20లు కలిపి 78 పరుగులు చేశాడు. ఇలా రెండు జట్లకు ఆడే విషయంలో తేడాలపై సెహ్వాగ్ మండిపడ్డాడు.
ఆసీస్‌కు ఆడేటప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు విఫలమైతే తనను ఎక్కడ తీస్తారో అనే భయం అతనికి ఉంటుందని.. అందుకే ఆసీస్ జట్టుకు ఆడుతున్నప్పుడు అతని ప్రవర్తనలో మార్పు వస్తుందని అన్నాడు. మ్యాక్సీ ఆటతీరు పూర్తిగా మారిపోతుందని సెహ్వాగ్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో అలాంటి ఒత్తిడి ఉండదని.. మ్యాచ్‌లు ఆడినా.. ఆడకపోయినా యాజమాన్యం ఆటగాళ్లకు అందించాల్సిన డబ్బులు ఇచ్చేస్తుందని.. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌కు వస్తే ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడని.. అందుకే ఇతర ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం.. తోటి క్రికెటర్లతో కలిసి విహారయాత్రలు చేయడం వంటి వాటితో గడిపేస్తాడని అన్నాడు. ఆట ముగిసిన తర్వాత ఫ్రీగా అందించే డ్రింక్స్‌ను తన హోటల్ రూంకు తీసుకెళ్లి తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడని అన్నాడు. గతంలో కూడా మ్యాక్సీ మీద సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సెహ్వాగ్ కామెంట్స్‌పై మ్యాక్స్‌వెల్ స్పందిస్తూ 'సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడదలచుకోలేదు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయనందుకు అతనికి నాపై కోపం ఉన్నట్టుంది. అతని వ్యాఖ్యలు నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు' అని చెప్పుకొచ్చాడు.