దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన సత్తా తెలియజేస్తూ సెంచరీని సాధించాడు. 299 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సెంచరీతో ఢిల్లీ ఛేదించింది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడిన భారత మాజీ కెప్టెన్ కోహ్లీ, షాట్ ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసింది. 4 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (131; 101 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం సాధించాడు. నితీశ్ రాణా (77; 55 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (74; 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సత్తా చాటారు. రిషభ్‌పంత్ (5) పరుగులతో నిరాశపరిచారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, హేమంత్ రెడ్డి చెరో రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, కె.ఎస్.నరసింహ రాజు తలో వికెట్ తీసుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టులో రికీ భుయ్ సెంచరీతో (122; 105 బంతుల్లో, 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.