విరాట్ కోహ్లీ@14 ఏళ్లు.. ఇన్‌స్టాలో వీడియో
Virat Kohli Shares Montage On 14th Anniversary Of International Debut.పరుగుల యంత్రం, రికార్డుల రారాజుగా కీర్తి
By తోట వంశీ కుమార్
పరుగుల యంత్రం, రికార్డుల రారాజుగా కీర్తి గడించాడు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి నేటికి(ఆగస్టు18) 14 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ 14 ఏళ్ల అనుభవాల్ని పంచుకున్నాడు. కొన్ని ఫోటోలతో వీడియోను పోస్టు చేశాడు. "14 ఏళ్ల క్రితం కెరీర్ మొదలైంది. నాకు దక్కిన గొప్ప గౌరవం" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు.
డంబుల్లా వేదికగా 2008 ఆగస్టు 18న శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లీ అరంగ్రేటం చేశారు. తొలి మ్యాచ్‌లో 22 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రాణించకున్నా టీమ్ఇండియా ఘన విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో విఫలం అయినా.. తరువాత తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు. చాలా తక్కువ సమయంలోనే టీమ్ఇండియాలో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు.
ఇప్పటి వరకు కోహ్లీ 102 టెస్టుల్లో 8074 పరుగులు, 262 వన్డేల్లో 12,344 పరుగులు, 99 టి20ల్లో 3308 పరుగులు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించగా.. టి20ల్లో మాత్రం 30 అర్థసెంచరీలు చేశాడు.
14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చేజింగ్ కింగ్‌గా మారిపోయాడు. భారత్ లక్ష్య ఛేధనకు దిగిందంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది అన్న అభిప్రాయానికి తీసుకొచ్చాడు. తన వన్డే కెరీర్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 43 శతకాలు బాదాడు. అందులో 22 సెంచరీలను చేజింగ్‌లోనే బాదాడంటే అతడికి చేజింగ్ అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది. తీవ్ర ఒత్తిడిలోనూ రాణించడం కోహ్లీ ప్రత్యేకత.
ఒకానొక దశలో దిగ్గజ ఆటగాడు సచిన్ రికార్డును(వన్డే శతకాలు 49) ఈజీగా బీట్ చేస్తాడని అంతా బావించారు. అయితే.. గత రెండు మూడేళ్లుగా కోహ్లీ ఆటతీరు మసకబారుతోంది. 14 ఏళ్ల కెరీర్‌లో అన్ని ఫార్మట్లలో కలిపి 70 శతకాలు చేసిన కోహ్లీ.. 71వ శతకాన్ని అందుకోవడానికి మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ఆటగాడు అయినా తన కెరీర్‌లో ఫామ్ కోల్పోవడం సహజం. అయితే.. కోహ్లీ విషయంలో అది చాలా ఎక్కువ కాలం కొనసాగుతూ వస్తోంది.
విండీస్ టూర్‌కు దూరంగా ఉన్న కోహ్లీ ఆసియా కప్ 2022 టోర్నీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడుతున్నాడు కోహ్లీ. ఆసియా కప్‌లో సెంచరీ చేసి మునుపటి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.