విరాట్.. మరో సంచలన నిర్ణయం

Virat Kohli Says Goodbye Captaincy. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ

By Medi Samrat  Published on  20 Sept 2021 11:13 AM IST
విరాట్.. మరో సంచలన నిర్ణయం

టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ ఆదివారం నాడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ.. బెంగళూరుకు కెప్టెన్‌గా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించాడు. తన కెరియర్ ముగిసే వరకు మాత్రం బెంగళూరుతోనే ఉంటానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత తేలిక కాకపోయినప్పటికీ ఫ్రాంచైజీ ప్రయోజనాల కోసం సరైన నిర్ణయమేనని అన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రకటించినప్పటి నుంచే ఈ విషయంపైనా ఆలోచించానని, సహచర ఆటగాళ్లతోనూ చర్చించానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీకి నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయమని, స్ఫూర్తిదాయకమని కోహ్లీ అన్నాడు. ఈ అవకాశం కల్పించిన బెంగళూరు మేనేజ్‌మెంట్‌కు, కోచ్‌లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలని చెబుతూ కోహ్లీ ఓ వీడియోను విడుదల చేశాడు. కోహ్లీ అనూహ్య నిర్ణయంపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. బెంగళూరు జట్టుకు కోహ్లీ గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆర్సీబీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. బెంగళూరు తరపున ఇప్పటి వరకు 199 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 5 శతకాలతో 6076 పరుగులు చేశాడు. అయితే ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా కోహ్లీ అందించలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. అయితే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఈ ఏడాదైనా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతుందేమోనని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story