విరాట్ @300 నాటౌట్.. కోహ్లీ @22.. వాళ్ల సరసన చేరబోతున్నాడు..!
పాకిస్థాన్‌పై వన్డే కెరీర్‌లో 51వ సెంచరీ సాధించి భారత జట్టును గెలిపించిన వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ..
By Medi Samrat Published on 1 March 2025 8:38 AM IST
పాకిస్థాన్‌పై వన్డే కెరీర్‌లో 51వ సెంచరీ సాధించి భారత జట్టును గెలిపించిన వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఛాంపియన్స్ ట్రోఫీని అద్భుతంగా ప్రారంభించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడైన కోహ్లీ.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగనున్న మ్యాచ్ ద్వారా మరో మైలురాయిని సాధించనున్నాడు. విరాట్‌కి ఇది 300వ వన్డే మ్యాచ్ కాగా.. ఈ సందర్భంగా ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరోసారి తన బ్యాట్‌తో సరికొత్త రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోహ్లీ కంటే ముందు ప్రపంచంలో 21 మంది క్రికెటర్లు మాత్రమే 300 వన్డే మ్యాచ్‌లు ఆడగలిగారు.
300 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏడో భారత ఆటగాడు విరాట్. అతనికి ముందు ఆరుగురు భారతీయులు 300 వన్డేలు ఆడారు. వీరిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఉన్నారు. విరాట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 299 వన్డే మ్యాచ్‌లలో 58.20 సగటుతో 14,085 పరుగులు చేశాడు. వీటిలో 51 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 93.41 కాగా.. అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 పరుగులు.
అయితే 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్ కూడా విరాట్ వెనుక ఉన్నాడు. 299 వన్డే మ్యాచ్‌ల తర్వాత సచిన్ 44.20 సగటుతో 11,537 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 186* పరుగులు. అప్పటికి సచిన్ 33 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు చేశాడు.
లక్ష్య ఛేదన సమయంలో కూడా విరాట్ కోహ్లీ వన్డేల్లో చాలా పరుగులు చేశారు. విరాట్ 64.3 సగటుతో ఛేజింగ్‌లో 7,979 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లోనే అతని అత్యుత్తమ స్కోరు (183) కూడా నమోదైంది. ఇది మాత్రమే కాదు.. లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనే విరాట్ తన 51 సెంచరీలలో 28 శతకాలు చేశాడు.